Stock Markets Closing Today Jan 2nd 2025 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. బీఎస్‌ఈ, సెన్సెక్స్ 1436 పాయింట్లు లాభాలతో ముగిసింది. నిఫ్టీ 24,188 వద్ద క్లోజ్ అయింది. ముఖ్యంగా ఫైనాన్షియల్, ఆటో, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. బుల్ రన్ వల్ల మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒకేరోజు రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.450 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు, డాలరుతో రూపాయి మారకం విలువ మాత్రం మరో 10 పైసలు క్షీణించి 85.74కి చేరింది.
లాభాల్లో ముగిసిన స్టాక్స్
(సెన్సెక్స్ 30 సూచీ) బజాజ్ ఫిన్సెర్వ్ బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్
నష్టాల్లో ముగిసిన స్టాక్స్
(సెన్సెక్స్ 30 సూచీ) సన్ ఫార్మా (ఈ సూచీలో సన్ ఫార్మా తప్ప, అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి)
ముడిచమురు ధరలు
Crude Oil Prices January 2nd 2025 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర రూ.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బుల్ జోరుకు కారణాలివే!
- 2024 డిసెంబర్లో అటమొబైల్ టోకు(వోల్సేల్) విక్రయాలు మదుపర్లకు ఉత్సాహాన్ని కలిగించాయి. సాధారణంగా డిసెంబర్ నెలలో ఆటో సేల్స్ నెమ్మదిస్తుంటాయి. కానీ దానికి భిన్నంగా అంచనాలు మించి విక్రయాలు నమోదయ్యాయి. ఇది మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్‌కు కారణమైంది. ఐషర్ మోటార్స్ 25శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మారుతీ సుజుకీ 30శాతం గ్రోత్‌ను కనబరిచింది.
- గత నెల త్రైమాసికంతో పాటు 2025లోనూ ఐటీ కంపెనీలు మెరుగైన రెవెన్యూ వృద్ధిని కనబరిచే అవకాశం ఉందన్న సీఎల్‌ఎస్‌ఏ, సిటీ బ్రోకరేజీ సంస్థల అంచనాలు- ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుకు కారణమైంది. దీంతో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు గురువారం లాభాలు సాధించాయి.
- ఇక, డిసెంబర్ నెలకు సంబంధించి వెలువడిన జీఎస్టీ లెక్కలు సైతం ఇన్వెస్టర్లను మెప్పించాయి. గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే 7 శాతం వృద్ధితో రూ.1.77 లక్షల కోట్లుగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోందన్న సంకేతాలు వచ్చాయి. మరోవైపు- ఆటో, ఫైనాన్షియల్ వంటి రంగాలకు నుంచి వస్తున్న గణాంకాలు మూడో త్రైమాసికంలో మెరుగైన ఫలితాల నమోదు కావొచ్చన్న అంచనాలకు కారణమైంది.
- అటోమొబైల్ రంగానికి తోడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ బలంగా పుంజుకోవడం వల్ల గురువారం మార్కెట్ సూచీలు రాణించాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడటం వల్ల సూచీలకు కలిసొచ్చింది.