ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే డెయిరీల్లో పాలు పోసే రైతులకు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందని ద్రాక్షలా మారింది. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు ఒక్కో రైతుకు వేలాది రూపాయల బకాయిలు నిలిచిపోయాయి. పాడిపశువుల నిర్వహణ కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రోత్సాహకం కోసం కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, తమ గోడును పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు.
వంద కోట్లకు పైనే..
విజయ, ముల్కనూరు, కరీంనగర్, మదర్ డెయిరీల్లో పాలు పోసే సుమారు 2.12 లక్షల మంది రైతులు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో రెండు, మూడు నెలలకు ఒకసారైనా డబ్బులు చెల్లించే ప్రభుత్వం, ఈ సారి మాత్రం ఏడాది దాటినా పైసలు ఖాతాల్లో జమ చేయకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు డెయిరీల్లో కలిపి వంద కోట్లకు పైగా ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి.
డెయిరీల వారీగా నాలుగు రూపాయాల ప్రోత్సాహకం పెండింగ్ వివరాలు
డెయిరీ | పాలుపోసిన రైతులు | పెండింగ్ ఉన్న మొత్తం రూ.కోట్లలో |
విజయ | 90వేలు | 54 |
మదర్ | 48వేలు | 18 |
కరీంనగర్ | 52వేలు | 20.4 |
ముల్కనూరు | 22వేలు | 8.5 |
వర్షాలు లేక పశుగ్రాసానికి కొరత ఏర్పడిందని, సంరక్షణ కష్టంగా మారిందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రోత్సాహకం విడుదల చేయాలని వేడుకుంటున్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని... సమస్యను పశుసంవర్ధక శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: చర్చలు సఫలం... సమ్మె విరమించిన జూడాలు