రాష్ట్రంలో వేడుకలు, ఎగ్జిబిషన్లు, సమావేశాల నిర్వహణకు వివిధ శాఖల అనుమతులకు సంబంధించి పటిష్ఠమైన నిబంధనలు రూపొందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. పురపాలక, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు.
ఇప్పటివరకు వివిధ శాఖలు సమర్పించిన ముసాయిదా నిబంధనలపై భేటీలో చర్చించారు. శాశ్వత భవనాలు, సముదాయాలు, తాత్కాలిక సముదాయాలలో జరిగే ఎగ్జిబిషన్లు, వేడుకలను వర్గీకరించడం... చిన్న, మధ్య, పెద్ద తరహా కేటగిరీలుగా విభజించి నిబంధనలను రూపొందిస్తున్నట్లు జోషి తెలిపారు. నిర్వాహకులు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహణ విధానాలపై సలహాలు, వివరాలు అందిస్తామన్న ఆయన... ముసాయిదా నిబంధనలపై సంబంధిత శాఖల సలహాల అనంతరం తుది నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని పేర్కొన్నారు.
నిర్వాహకులు నిబంధనలకు సంబంధించి స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందని సీఎస్ చెప్పారు. దరఖాస్తు సమర్పణ, అనుమతులకు సంబంధించి నిర్ణీత గడువు ఇస్తామన్నారు. నుమాయిష్, చేప ప్రసాదం పంపిణీ, ఎగ్జిబిషన్ లాంటి రెగ్యులర్ ఈవెంట్స్‌కు సంబంధించి ఫైర్, బీమా, మంచినీరు, విద్యుత్, లే అవుట్, పార్కింగ్, టౌన్ ప్లానింగ్, పీసీబీ, పోలీసు తదితర శాఖల నుంచి అనుమతుల కోసం విధివిధానాలు జారీ చేస్తామని తెలిపారు. వివిధ శాఖల నుంచి అనుమతుల దరఖాస్తు పత్రం సరళంగా ఉండాలని సీఎస్ జోషి అధికారులను ఆదేశించారు. ఇవీ చూడండి: 'మద్దతు ధరకు వ్యూహం రూపొందించండి'