Woman Try To Kill Friend Wife Kerela : నర్సు వేషధారణలో వచ్చి బాలింతను చంపేందుకు కుట్ర పన్నింది ఓ మహిళ. సిరంజితో గాలిని ఎక్కించి బాలింతను హతమార్చేందుకు ప్రయత్నించింది. ఈ దారుణ ఘటన కేరళలోని పతనంతిట్టలో శుక్రవారం జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?..
అలప్పుజాకు చెందిన అనూష(25), అరుణ్ మంచి స్నేహితులు. ఇటీవలే అరుణ్ భార్య స్నేహ(24) పతనంతిట్టలోని ఓ ఆస్పత్రిలో ప్రసవం జరిగింది. ఆమె డెలివరీ అయిన తర్వాత కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో స్నేహను చంపేందుకు అరుణ్ ఫ్రెండ్ అనూష ప్లాన్ చేసింది. నర్సు వేషధారణలో అనూష చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లింది. సిరంజితో గాలిని స్నేహకు ఇంజెక్ట్ చేసింది. వెంటనే స్నేహకు గుండెపోటు వచ్చింది. వెంటనే వైద్యులు అనూషకు మెరుగైన వైద్యం అందించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
నర్సు వేషంలో వచ్చిన అనూషపై స్నేహ తల్లికి అనుమానం వచ్చి ఆపింది. వెంటనే ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితురాలు అనూషను అరెస్ట్ చేశారు. నిందితురాలు అనూషకు అరుణ్‌తో ఉన్న సంబంధంపై ఆరా తీశారు. నిందితురాలి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని.. అందులో నుంచి కాల్ డేటా సేకరించారు. నిందితురాలిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
'ఇటువంటి కేసును ఎయిర్ ఎంబోలిజం అంటారు. నిందితురాలు అనూషపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ఈ కేసులో స్నేహ భర్త అరుణ్‌ను కూడా విచారిస్తాం. ప్రస్తుతం బాలింత స్నేహ ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదు.' అని పోలీసులు తెలిపారు.
స్థానికుల వివరాల ప్రకారం.. అనూష.. ఫార్మసీ చదివింది. కనుక మనిషి రక్తనాళంలోకి గాలి చేరితే ప్రాణాలు కోల్పోతారని ఆమెకు తెలుసు. అందుకే స్నేహను హతమార్చేందుకు సిరంజి ద్వారా గాలిని ఎక్కించినట్లు సమాచారం. అరుణ్‌పై ఇష్టంతోనే అనూష.. అతడి భార్యను హతమార్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని అనూష భావించినట్లు సమాచారం.