ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే తీరత్ సింగ్ రాజీనామా చేయటం గమనార్హం.
"గవర్నర్కు నా రాజీనామా లేఖను సమర్పించాను. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం దృష్ట్యా.. నేను రాజీనామా చేయటమే సరైన మార్గమని భావించాను. ఇన్నాళ్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర నాయకత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు."
-తీరత్ సింగ్ రావత్
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరాఖండ్ భాజపా శాసనసభాపక్ష భేటీ జరగనుంది. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మదన్ కౌశిక్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఇందులో తమ తదుపరి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కేంద్ర పరిశీలకుడిగా కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్.. హాజరుకానున్నారు.
ఆరు నెలల్లోపే కావాల్సి ఉండగా..
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఆరు నెలల్లోపే ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు నెలలు పూర్తికాగా.. సెప్టెంబర్ 10 నాటికి ఆరు నెలలు అవుతుంది. అయితే, రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నా.. ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా ఉప ఎన్నికలు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గడువు ముగిసేవరకు ఇలాగే పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే రాజీనామా చేయడమే ఉత్తమ మార్గమని భావించి తీరత్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.