అక్రమ నిర్మాణాలపై బుల్డోజరు ప్రయోగం చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ అధికారులు అత్తింటివారు లోనికి రానివ్వని ఓ కోడలి కాపురాన్ని చక్కదిద్దేందుకూ అదే మార్గం ఎంచుకొని విజయం సాధించారు. బిజ్నోర్ జిల్లా ప్రొబేషన్ అధికారి రుబీ గుప్తా మంగళవారం ఆ వివరాలు వెల్లడించారు. హల్దౌర్ పోలీస్‌స్టేషను పరిధిలోని హరినగర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకొంది.
అత్తవారింటి నుంచి గెంటివేతకు గురైన నూతన్ మాలిక్‌కు న్యాయం చేయాలంటూ ఆమె తండ్రి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంక్ మేనేజర్ అయిన రాబిన్‌సింగ్‌తో ఈమెకు అయిదేళ్ల కిందట వివాహం జరిగింది. కట్నం వేధింపులపై నూతన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల 2019 జూన్‌లో భర్తను అరెస్టు చేశారు. దీంతో ఆమెను అత్తింటివారు బయటకు గెంటేశారు. ఈ నేపథ్యంలో.. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు నూతన్ మాలిక్‌ను వెంటబెట్టుకొని ఆమె అత్తవారింటికి వెళ్లారు. తలుపులు తెరిచేందుకు వారు ససేమిరా అనడం వల్ల.. పలుమార్లు చర్చించాక ఇక ఫలితం లేదని అధికారులు బుల్డోజరును తెప్పించారు. 'బాబ్బాబూ! తప్పయిపోయింది' అంటూ అత్తామామలు వెంటనే తలుపులు తెరిచారు. కోర్టు ఆదేశాల మేరకు.. నూతన్ అత్తవారింటిలోకి వెళ్లాక కూడా ఆమెకు పోలీసు రక్షణ ఉంటుందని ఏఎస్పీ ప్రవీణ్ రంజన్‌సింగ్ తెలిపారు.
భార్య కొడుతోందని చెట్టెక్కి కూర్చున్న భర్త..
భార్య కొడుతోందన్న కారణంతో ఒక వ్యక్తి వంద అడుగుల తాటిచెట్టు ఎక్కి అక్కడే ఉండిపోయాడు. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు.. ఏకంగా 32రోజుల పాటు అక్కడే ఉన్నాడు. చివరకు జిల్లా అధికార యంత్రాంగానికి ఈ విషయం తెలియడంతో వారు అతనికి నచ్చచెప్పి కిందకు దించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మౌ జిల్లా బసరత్‌పూర్ గ్రామానికి చెందిన రాంప్రవేశ్ అనే వ్యక్తికి అతని భార్యకు మధ్య నిత్యం గొడవలు జరిగేవి. రాంప్రవేశ్‌ను అతని భార్య రోజూ తీవ్రంగా కొట్టేది. ఈ క్రమంలో అతను దెబ్బలకు తాళలేక గ్రామం సమీపంలోని వంద అడుగుల ఎత్తున్న తాటి చెట్టు ఎక్కేశాడు.
చెట్టుపై కూర్చునే విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో, రాత్రిళ్లు చెట్టు దిగి కాలకృత్యాలు తీర్చుకునేవాడు. తాడుకు బుట్ట వంటిది కట్టి చెట్టుపై నుంచి కిందకు వేయగా కుటుంబసభ్యులు ఆహారం, మంచినీరు అందులో ఉంచేవారు. అలా ఆహారం చెట్టుపైకి లాక్కుని అక్కడే తినేవాడు. మరోవైపు, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో అధికారులు రంగంలోకి దిగారు. రాంప్రవేశ్‌ను కిందకు దింపేందుకు యత్నించారు. ఈ క్రమంలో అతను పొరపాటున కింద పడి గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇవీ చదవండి: 'భర్త పనిచేసే ఆఫీసుకెళ్లి మరీ భార్య వేధించడం క్రూరత్వమే'
అంధత్వం అడ్డురాలేదు.. పట్టుదలతో సాధించాడు.. లక్షల్లో జీతంతో మైక్రోసాఫ్ట్‌లో కొలువు