కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు సమీపంలోని క్రాంతివీర సంగోలీ రైల్వేస్టేషన్‌లో వందే భారత్ రైలును జెండా ఊపి శ్రీకారం చుట్టారు. దక్షిణ భారతంలో ఇదే తొలి వందే భారత్ రైలుకాగా ఈ రైలు బెంగళూరు మీదుగా మైసూరు-చెన్నై మధ్య నడవనుంది. ఇప్పటికే దేశంలో 4 వందే భారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. ఇది ఐదవది కాగా దక్షిణ భారత దేశంలో మెుదటిది. వందేభారత్ తోపాటు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు. రైల్వే శాఖ ప్రవేశ పెట్టిన భారత్ గౌరవ్ విధానంలో కర్ణాటక దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఈ రైలు నడవనుంది. దక్షిణ భారతదేశం నుంచి కాశీ యాత్రకు వెళ్లే చాలామంది యాత్రికుల కోసం 8 రోజుల టూర్ ప్యాకేజీని ఈ రైలు అందించనుంది. ఈ రైలు వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రయాణించనుంది. కాశీ విశ్వనాథ్ యాత్రికులకు కర్ణాటక ప్రభుత్వం 5 వేలు సాయం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అనంతరం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5 వేల కోట్ల రూపాయలతో పర్యావరణ హితంగా నిర్మించిన టెర్మినల్-2ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ టెర్మినల్‌లో వెదురుతో చేసిన నిర్మాణాలు అబ్బురపరుస్తున్నాయి. టెర్మినల్ ఇన్ ఎ గార్డెన్ అనే పేరుతో ఈ టెర్మినల్ 2ను పిలుస్తున్నారు. టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ వెదురు నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. టెర్మినల్ 2ను వెదురు నిర్మాణ అద్భుతంగా విమానాశ్రయ సిబ్బంది అభివర్ణించారు. ప్రపంచంలో మరెక్కడా లేని పర్యావరణ హిత దృశ్యాలు ప్రయాణికులకు మరిచిపోలేని జ్ఞాపకాలను ఇస్తాయని వెల్లడించారు.
విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 108 అడుగుల కెంపేగౌడ విగ్రహాన్ని ప్రధాని ప్రారంభిచారు. 600 సంవత్సరాల క్రితం బెంగళూరు నగరాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతి నాడప్రభు కెంపేగౌడ స్థాపించారని చరిత్ర చెబుతోంది. ఆ మహారాజు జ్ఞాపకంగా 108 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటకలో శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల కంటే తక్కువ సమయం ఉన్న వేళ మోదీ బెంగళూరు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి:అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఏటా 12లక్షల వీసాలు!