Man Raped His Sister With His Friends : సొంత సోదరిపై నలుగురు స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. అక్కడితో ఆగకుండా ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ అమానుష ఘటన ఒడిశా కంధమాల్ జిల్లాలో నవంబర్ 3న జరిగింది. తాజాగా కేసును ఛేదించి నిందితులను శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.
ఆకుల కోసం అడవికి వెళ్లి.. ఆపై..!
జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలంగా తన మరదలితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి సోదరి వివాహేతర బంధాన్ని ఆపేయాలని మందలించింది. ప్రవర్తన మార్చుకోకుంటే అందరికీ ఈ విషయాన్ని చెప్పేస్తానని సోదరుడికి తేల్చి చెప్పింది. దీంతో అతడు తన సోదరిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైన తన సోదరిని హత్య చేయాలని భావించాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు.
'ఘటన జరిగిన రోజు మృతురాలు సియాలీ ఆకులను సేకరించేందుకు సమీపంలోని అడవికి వెళ్లింది. ఆమె సోదరుడు కూడా అక్కడే పశువులను కాస్తున్నాడు. సోదరిని గమనించిన అతడు వెంటనే తన నలుగురు స్నేహితులను అడవికి పిలిపించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత వంతులవారీగా ఒక్కొక్కరు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో సదరు యువతి కామాంధుల చెర నుంచి తప్పించుకునేందుకు ప్రతిఘటించింది. దీంతో నిందితులు ఆమె గొంతు కోసి, ఆపై అక్కడే ఉన్న గొడ్డలితో దాడి చేసి చంపేశారు. ఆ యువతి అక్కడే ప్రాణాలు విడిచింది' అని పోలీసులు వివరించారు.
చంపాడు.. కేసు పెట్టాడు!
సోదరిని చంపిన తర్వాత నిందితుడు నవంబర్ 6న స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. ఈ క్రమంలో నవంబరు 7న అడవిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం పరీక్షలకు పంపారు. అయితే పోస్టుమార్టం నివేదికలో యువతిపై పలువురు అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి చంపారని తేలినట్లుగా చకపాడ్ ఇన్‌స్పెక్టర్ లలిత్ మోహన్ సాగర్ సోమవారం తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురిని శనివారం అరెస్టు చేశారు.
'మీ ఓటమి ఫ్రస్ట్రేషన్ సభలో చూపించొద్దు'- కాంగ్రెస్కు మోదీ చురకలు
భారీగా వర్షాలు, రైలు పట్టాలపై నీరు-మిగ్‌జాం తుపానుతో స్తంభించిన రవాణా వ్యవస్థ!