కేరళలో అధికార వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్‌డీఎఫ్) ప్రభంజనం సృష్టించింది. వరుసగా రెండు సార్లు గెలిచే సంప్రదాయం లేని రాష్ట్ర అసెంబ్లీ చరిత్రను తిరగరాసింది. ప్రత్యర్థిని చిత్తు చేయడంలో పినరయి విజయన్ అపార కృషి చేశారు. అభివృద్ధి మంత్రంతో ప్రజల మనసును గెలుచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమిని ప్రత్యర్థికి అందనంత ఎత్తులో ఉంచగలిగారు.
గెలుపొందిన సీట్లు..
ఎల్‌డీఎఫ్- 99
యూడీఎఫ్- 41
ఎన్డీఏ- 0
ఇతరులు- 0
గత కొన్ని దఫాల కేరళ ఎన్నికలను పరిశీలిస్తే.. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఐదేళ్ల పాలన పూర్తి అయిందంటే.. మరో కూటమి అధికారంలోకి రావాల్సిందే. ఒకసారి ఎల్‌డీఎఫ్ గెలిస్తే.. మరోసారి యూడీఎఫ్ గెలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ గెలిచింది కాబట్టి.. ఈసారి యూడీఎఫ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. పినరయి విజయన్ మ్యాజిక్ చేశారు. మరోసారి తన నాయకత్వ పటిమతో ఎల్డీఎఫ్కు విజయాన్ని కట్టబెట్టారు.
అయితే, వామపక్ష కూటమికి ఈ విజయం ఊరికే రాలేదు. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ఐదేళ్ల పాలన అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఏ ముఖ్యమంత్రికి తన పదవీకాలంలో ఎదురుకాని సవాళ్లు విజయన్‌కు పరీక్ష పెట్టాయి. వరదలు, ప్రకృతి విపత్తులు, నిపా వైరస్, కరోనా మహమ్మారి వంటి సంక్షోభాలతో ఈ ఐదేళ్లలో రాష్ట్రం అతలాకుతలమైంది. బంగారం అక్రమ రవాణా, లైఫ్ మిషన్‌లో అవినీతి, ఐటీ విభాగంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు విజయన్ సర్కారు మెడపై కత్తిలా వేలాడాయి. విపక్షాలు ఈ ఆరోపణలను వజ్రాయుధాల్లా ఉపయోగించుకున్నాయి. ప్రచారం నిర్వహించిన ప్రతిసారి ఈ ఆరోపణలతో సర్కారుపై విరుచుకుపడ్డాయి. అయితే, ఈ ఆరోపణలను ప్రజలు పట్టించుకోకపోవడానికి, ఎల్డీఎఫ్కు మరోసారి పట్టం కట్టించడానికి కారణాలు విస్పష్టం. సంక్షోభ సమయంలో ప్రభుత్వం చూపించిన తెగువ. పాలనా కాలంలో సర్కారు పఠించిన అభివృద్ధి మంత్రం. ఇవే విజయన్ గెలుపునకు దోహదం చేశాయి.
విపత్తు వేళ..
రాష్ట్రాన్ని గడగడలాడించిన నిపా వైరస్‌ను వామపక్ష ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. ఎక్కువ ప్రాణనష్టం కాకుండా జాగ్రత్తపడింది. తర్వాత వచ్చిన వరద విపత్తును సైతం అధిగమించింది. వరదలు ముంచెత్తిన కాలంలోనూ వామపక్ష ప్రభుత్వం ఇంటింటికీ ఠంచనుగా రేషన్ సరకులు సరఫరా చేసింది. సహాయ కార్యక్రమాలను జోరుగా చేపట్టింది. నిపా వైరస్‌తో పాటు రెండు భారీ వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలు, కొవిడ్ విజృంభణ వంటి విపత్తులనూ సమర్థంగా ఎదుర్కొనడం ద్వారా ఎల్‌డీఎఫ్ ప్రజాదరణ చూరగొంది. లాక్‌డౌన్ సమయంలో ఇంటింటికీ ఆహార/నిత్యావసర కిట్లు అందించింది.
కరోనా కట్టడిలో విజయం
తాజాగా వచ్చిన కరోనా వైరస్‌ను మొదటి వేవ్‌లో సమర్థంగా ఎదుర్కోగలిగారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. రెండో దశలో కేసుల ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ.. వాటిని ప్రణాళికాబద్ధంగా నియంత్రిస్తున్నారు. తొలి దశ అనుభవంతో రాష్ట్రంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాలను ఆక్సిజన్ కొరత వేధిస్తుంటే.. కేరళ మాత్రం తన అవసరాలతో పోలిస్తే రెట్టింపు ప్రాణావాయువును ఉత్పత్తి చేస్తోంది. ఇతర రాష్ట్రాలకూ సరఫరా చేస్తోంది. ఇదంతా పినరయి విజయన్ ముందుచూపు, దార్శనికత వల్లే సాధ్యమైంది!
అభివృద్ధి సోపానాలెన్నో
2016 అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో 600 పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటును ప్రకటించింది ఎల్‌డీఎఫ్. వాటిలో 30 తప్ప మిగిలిన పథకాలన్నింటినీ నెరవేర్చామని ముఖ్యమంత్రి విజయన్ ఉద్ఘాటించారు. మిగిలినవాటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌డీఎఫ్ నెరవేర్చిన వాగ్దానాలలో 'ఆర్ద్రం' పథకం ముఖ్యమైనది. దీని కింద ఆ రాష్ట్రంలో ప్రజారోగ్య యంత్రాంగాన్ని సంస్కరించారు.
ప్రతికూలతలూ ఉన్నా..
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటి అంశాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. మొదటి అంశంపై ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన పినరయి సర్కారు.. దాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున భక్తులంతా చేరి.. తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. శబరిమలకు వెళ్లేందుకు యత్నించిన మహిళలను అడ్డుకున్నారు.
ఇదీ చూడండి: ఎగ్జిట్‌పోల్స్: కేరళ పగ్గాలు మరోమారు విజయన్‌కే!
సుప్రీం తీర్పును తొలుత స్వాగతించిన యూడీఎఫ్.. తర్వాత ఈ విషయంపై సర్కారును ఇరకాటంలో పెట్టేందుకు యత్నించింది. సార్వత్రిక ఎన్నికల్లో 20 సీట్లలో 19ని గెలుచుకునేందుకు ఉపయోగపడ్డ శబరిమల అంశాన్నే ఈసారీ పైకెత్తుకుంది. సుప్రీం తీర్పుపై వైఖరి చెప్పాలంటూ సర్కారుపై ఒత్తిడి పెంచింది. అయితే, ఈ వ్యూహం ఆ కూటమికి చేటు చేసింది. శబరిమల నినాదం ముస్లిం ఓటర్లను కాంగ్రెస్‌కు దూరం చేసింది.
అదే సమయంలో, ఎల్‌డీఎఫ్ ఎంతో సంయమనంతో వ్యవహరించింది. శబరిమల సమస్య కోర్టులో ఉన్నందువల్ల దాని గురించి పార్టీలు చేయగలిగిందేమీ లేదని చెబుతూ వచ్చింది. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే దీన్ని లేవనెత్తుతున్నారని ఆ పార్టీ కొట్టిపారేసింది. ఇక సీఏఏ విషయాన్ని ముందు నుంచీ వ్యతిరేకించింది కేరళ సర్కార్. ఈ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది కూడా.
విజయన్ మ్యాజిక్
సమకాలిన కేరళ రాజకీయాల్లో అత్యంత ప్రభావంతమైన నాయకుడిగా ఉన్నారు పినరయి విజయన్. ఆయన నాయకత్వాన్ని ప్రజలు నమ్మారు. ఎన్ని ఆరోపణలు ఉన్నా ఓటర్లు ఆయన వైపే నిలబడ్డారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయ రంగాలకు కేటాయింపులను ప్రతి బడ్జెట్‌లో పెంచుతూ వెళ్లారు విజయన్. సంక్షేమ పింఛనును పెంచారు. ప్రైవేటు రంగ పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చారు. ఫలితంగా నిస్సాన్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు రాష్ట్రంలో ఐటీ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. వీటన్నింటి వల్ల విజయన్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఒంటిచేత్తో ఎల్డీఎఫ్కు విజయం కట్టబెట్టించే స్థాయికి చేర్చింది. కరోనా విపత్తు సమయంలో ప్రతిపక్ష నాయకుడిని పక్కన కూర్చొబెట్టుకొని రాష్ట్ర ప్రజలకు ఆయన భరోసా ఇచ్చిన తీరు.. విజయన్ గౌరవాన్ని మరింత పెంచింది.
బలమైన పార్టీ
కేరళలో వామపక్ష పార్టీలకు గట్టి పట్టుంది. బలమైన పార్టీ నిర్మాణం విజయన్‌కు కొండంత అండగా మారింది. ఆయన సీపీఎం అండతో ముఖ్యమంత్రిగా అయ్యారు. అయితే గత ఐదేళ్లలో ఆయన పార్టీకి మించి ఎదిగారు. అదే సమయంలో, వామపక్షాలకు ప్రజల్లో మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల్లో కమ్యునిస్టుల ఓట్ల వాటా అధికమైంది. 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే విషయం స్పష్టమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్నప్పటికీ.. అనంతరం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. ఈ ఫలితాల వల్ల రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లోనూ జోరు కనబర్చింది.
క్రైస్తవుల ఓట్ల చీలికతో
కేరళలో మొదటి నుంచి యూడీఎఫ్‌కు క్రైస్తవులు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆర్థడాక్స్, జాకోబైట్ల మధ్య వైరుద్ధ్యం కారణంగా క్రైస్తవులు రెండు వర్గాలు అయ్యారు. ఈ సమస్య మరిష్కారానికి భాజపా ముందుకు వచ్చింది. దీంతో ఎన్నికల్లో కొందరు భాజపా వైపు నిలిచారు. ఫలితంగా క్రైస్తవ ఓటర్లను భాజపా ఆకర్షించగలిగింది. ఫలితంగా యూడీఎఫ్ ఓట్లకు గండిపడింది. తద్వారా ఎల్‌డీఎఫ్ విజయం సులభమైంది.
ఇదీ చూడండి: కేరళలో కామ్రేడ్ల హవా- యూడీఎఫ్‌కు నిరాశ
ఇదీ చూడండి: కేరళలో 73.58శాతం పోలింగ్ నమోదు