విదేశాలకు వెళ్లేందుకు వీలుగా తన పాస్‌పోర్ట్‌ను ఇవ్వాలని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కోసం తాను సింగపూర్ వెళ్లాల్సి ఉందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టు త్వరలోనే విచారణ జరపనుందని లాలూ తరఫు న్యాయవాది ప్రభాత్ కుమార్ తెలిపారు.
Lalu Prasad health condition : దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ.. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రెండు మూత్రపిండాలు 75శాతం మేర దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహం, హైబీపీతో లాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24న ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఈ నెల 20నే లాలూ సింగపూర్ వెళ్తారని సమాచారం.
అవిభాజ్య బిహార్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.950కోట్ల దాణా కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. 1996 జనవరిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఐదు కేసుల్లో లాలూకు శిక్ష పడింది. అనారోగ్య సమస్యలతో కొంతకాలం క్రితం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. పాస్‌పోర్ట్ సీబీఐ కోర్టు వద్దే ఉండగా.. విదేశాలకు వెళ్లడం కోసం ఇవ్వాలని ఇప్పుడు పిటిషన్ వేశారు. ఇదే తరహాలో.. లాలూ అభ్యర్థన మేరకు జూన్ 14న రెన్యువల్ కోసం పాస్‌పోర్ట్‌ను ఇచ్చింది సీబీఐ కోర్టు.