Power Crisis India: భారత్ జులై- ఆగస్టులో మరో విద్యుత్ సంక్షోభం ఎదుర్కోనుందని అంచనా వేసింది పరిశోధన సంస్థ క్రియా (సీఆర్ఈఏ- సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్). థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది.
దేశవ్యాప్తంగా అన్ని పవర్ ప్లాంట్లలో కలిపి ప్రస్తుతం 20.7 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అయితే.. విద్యుత్ డిమాండ్ కొంత పెరిగినా పరిష్కరించే స్థితిలో ప్రస్తుతం విద్యుత్ ప్లాంట్లు లేవని, ఇవి సంక్షోభానికి సంకేతాలని క్రియా తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.
2022 ఆగస్టులో భారత్‌లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 214 గిగా వాట్లు ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(సీఈఏ) అంచనా వేసింది. సగటు ఇంధన డిమాండ్ కూడా మేలో ఉన్న 1,33,426 మిలియన్ యూనిట్స్ కంటే అధికంగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.
'నైరుతి రుతుపవనాల ఆగమనం బొగ్గు తవ్వకాలకు, గనుల నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాకు మరింత ఆటంకం కలిగిస్తోంది. రుతుపవనాలకు ముందే బొగ్గును తగిన స్థాయిలో రవాణా చేయకుంటే.. 2022 జులై- ఆగస్టులో దేశం మరో విద్యుత్ సంక్షోభం వైపు పయనించే అవకాశం ఉంది.' అని క్రియా తన నివేదికలో స్పష్టం చేసింది.
దేశంలో ఇటీవల తలెత్తిన విద్యుత్ సంక్షోభం కూడా బొగ్గు ఉత్పత్తి వల్ల కాదని, పంపిణీలో నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణమని పేర్కొంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు రవాణా చేయట్లేదని, నిర్వహణ సరిపోట్లేదని అధికారిక గణాంకాల నుంచి స్పష్టమైనట్లు సీఆర్ఈఏ తెలిపింది.
2021-22 భారత్‌లో 777.26 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో(716.08 MT) పోలిస్తే 8.54 శాతం అధికం. అయితే ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని, 2020 మే నుంచే క్రమంగా పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు తగ్గుతూ వస్తున్నాయని క్రియా విశ్లేషకులు సునిల్ దహియా పేర్కొన్నారు.
"నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందు.. తగినంత బొగ్గు నిల్వ చేయకుండా పవర్ ప్లాంట్ ఆపరేటర్లు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉండటమే గతేడాది విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణం. తర్వాత వరదలు బొగ్గు గనులను ముంచెత్తడం వల్ల.. ఉత్పత్తికి అంతరాయం కలిగింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రవాణా చేయడంలో ఆటంకం కలిగింది.''
- సీఆర్ఈఏ రిపోర్ట్
ఇవీ చూడండి: ఏపీలో అనూహ్యంగా పెరిగిన విద్యుత్తు డిమాండు... వాయుదేవుడే దిక్కు!