Forces Vehicle Accident: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్లోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురై నదిలో పడిపోయింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎనిమిది మంది ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 30 మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు.
"మంగళవారం ఉదయం 39 మంది ఐటీబీపీ జవాన్లతో ప్రయాణిస్తున్న వాహనం.. బ్రేక్లు ఫైయిల్ అవ్వడం వల్ల పక్కన ఉన్న నదిలో పడిపోయింది. ఘటనాస్థలికి అధికారులు చేరుకున్నారు. బస్సులోని జవాన్లంతా అమర్నాథ్ యాత్రకు సంబంధించిన విధులు నిర్వర్తించి తిరిగి వస్తున్నారు" అని ఐటీబీపీ ఉన్నతాధికారులు తెలిపారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముర్ము, రాహుల్
జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఘోర ప్రమాదం పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ఐటీబీపీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభాతి తెలిపిన ముర్ము.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు, ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు, నలుగురు మృతి
గర్భిణీని మోస్తూ అడవిలో 3కిమీ నడక, అయినా దక్కని కవలల ప్రాణాలు