శత్రు దేశాలు ప్రయోగించే రాడార్ గైడెడ్ క్షిపణుల నుంచి మన యుద్ధవిమానాలను కాపాడుకునేందుకు 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్‌డీఓ) అధునాతన చాఫ్ పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఇది శత్రు అస్త్రాలను తప్పుదోవ పట్టిస్తుంది. ఈ టెక్నాలజీపై జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని, దీన్ని వాయుసేనలో ప్రవేశపెడతున్నట్లు డీఆర్‌డీఓ గురువారం తెలిపింది. ఈ సాధనానికి 'అడ్వాన్స్డ్ చాఫ్ మెటీరియల్ అండ్ చాఫ్ క్యాట్రిడ్జ్-118/1' అని పేరుపెట్టినట్లు వివరించింది. భారీ స్థాయిలో ఉత్పత్తి కోసం ఈ సాంకేతికతను పరిశ్రమలకు అందించినట్లు పేర్కొంది. దీన్ని జోధ్‌పుర్‌లోని డిఫెన్స్ ల్యాబ్, పుణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ (హెచ్‌ఈఎంఆర్‌ఎల్)లు అభివృద్ధి చేశాయి. 'ఆత్మనిర్భర్ భారత్' కింద ఇదో ముందడుగని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతను సాకారం చేయడానికి కృషి చేసిన బృందాలను డీఆర్‌డీఓ అధిపతి జి.సతీశ్ రెడ్డి అభినందించారు.
ఏమిటీ చాఫ్?
నేటి ఎలక్ట్రానిక్ యుద్ధ శకంలో అధునాతన శత్రు క్షిపణుల నుంచి పోరాట విమానాలను రక్షించుకోవడం సవాల్‌గా మారింది. ఇందుకోసం 'కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్' (సీఎండీఎస్)ను వినియోగిస్తున్నారు. ఇది శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ నుంచి యుద్ధవిమానాన్ని రక్షిస్తుంది. ఇందులో చాఫ్ వ్యవస్థ ఒక భాగం. చాఫ్‌లో అల్యూమినియం లేదా జింక్ పూత కలిగిన ఫైబర్లు ఉంటాయి. వాటిని యుద్ధ విమానాల్లో క్యాట్రిడ్జ్ రూపంలో భద్రపరుస్తారు.
రాడార్ గైడెడ్ క్షిపణుల నుంచి ముప్పు ఎదురైన పక్షంలో దీన్ని గాల్లోకి పైలట్ విడుదల చేస్తారు. ఫలితంగా అక్కడ చాఫ్ మేఘం ఏర్పడుతుంది. ఇందులోని పదార్థాలు రాడార్ తరంగాలను పరావర్తనం చెందిస్తాయి. దీనివల్ల శత్రు క్షిపణి గందరగోళానికి గురై, దారి తప్పుతుంది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన చాఫ్ క్యాట్రిడ్జ్ తక్కువ పరిమాణంలో పదార్థంతో, ఎక్కువ రక్షణ కల్పిస్తుంది. యుద్ధనౌకల రక్షణకూ చాఫ్ వ్యవస్థను మన దేశం అభివృద్ధి చేసింది. సీఎండీఎస్‌లో 'ఫ్లేర్' అనే మరో వ్యవస్థ కూడా ఉంటుంది. అది గాల్లో జ్వాలలను వెదజల్లుతుంది. శత్రువుల పరారుణ క్షిపణులను అవి దారిమళ్లిస్తాయి.
ఇదీ చూడండి: Drone : డ్రోన్లను ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ
ఇదీ చూడండి: ప్రతికూల వాతావరణంలోనూ గురి తప్పని 'ఆకాశ్'