Covid restrictions: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కొత్త కేసులు లక్ష దాటాయి. ఈ క్రమంలో వైరస్ కట్టడికి చర్యలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ట్రాలు. ప్రజలు ఒక్కచోటికి చేరటం, రాజకీయ, సామాజిక, ఇతర కార్యక్రమాలను నిషేధిస్తున్నాయి. కట్టుదిట్టంగా రాత్రి కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. ఓవైపు ఒమిక్రాన్ కేసులూ గణనీయంగా పెరుగుతున్న క్రమంలో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు బాటపట్టాయి.
రాజకీయ ర్యాలీలు, ఆందోళనలు నిషేధం
Covid restrictions in Uttarakhand: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది ఉత్తరాఖండ్ రాష్ట్రం. జనవరి 16వ తేదీ వరకు రాజకీయ ర్యాలీలు, నిరసనల వంటి వాటిపై నిషేధం విధించింది. అలాగే.. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సైతం 16 వరకు మూసివేసింది. వీటితో పాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. మార్కెట్లు రాత్రి పది వరకు తీసి ఉండగా.. జిమ్ములు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, ఆడిటోరియాలు, మైదానాలు వంటివి 50 శాతం సామర్థ్యంతో నడిపించాలని ఆదేశించింది. ఇతరులు రాష్ట్రంలోకి రావాలంటే వ్యాక్సిన్ తీసుకోవటం లేదా 72 గంటలకు ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ధ్రువపత్రం చూపించాల్సి ఉంటుంది.
జనవరి 30 వరకు పాఠశాలలు బంద్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది అసోం ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 5వ తరగతి వరకు పాఠశాలలను జనవరి 30 వరకు మూసివేసింది. అది గువాహటిలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల 8వ తరగతి వరకు సూళ్లు మూసివేయాలని స్పష్టం చేసింది. మరోవైపు..కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. కొత్త ఆంక్షలపై మార్గదర్శకాలు విడుదల చేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
100 మందికే అనుమతి..
Covid restrictions in Goa: గోవాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి కొత్త ఆంక్షలు ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ఎన్నికలు ఉన్న తీరప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో 100మంది మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేశారు. ఇండోర్ ప్రాంతాల్లో 50శాతం సామర్థ్యం సీటింగ్ కెపాసిటీని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లు, ప్రజా, రాజకీయ సమావేశాలు, బీచుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు జనవరి 26వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.
హైకోర్టులో వర్చువల్‌గా విచారణ..
Night Curfew in Gujarat: గుజరాత్లో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్న క్రమంలో వర్చువల్ పద్ధతిలో కేసుల విచారణ చేపట్టాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర హైకోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆన్లైన్ మోడ్‌లోనే కేసుల విచారణ కొనసాగస్తామని పేర్కొంది.
మరోవైపు.. కేసుల కట్టడికి శుక్రవారం రాత్రి కర్ఫ్యూ విధించింది గుజరాత్ ప్రభుత్వం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అహ్మదబాద్, సూరత్, వడోదరా, రాజ్‌కోట్, గాంధీనగర్, జునాగఢ్, జామ్‌నగర్, భవ్నాగర్, ఆనంద్, నడియాద్ జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు ఉంటాయని తెలిపింది. రాజకీయ, సామాజిక కార్యక్రమాలు, వివాహాలకు గరిష్ఠంగా 400 మంది, ఇండోర్ ప్రాంతంలో 50శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతించింది.. అంత్యక్రియలకు కేవలం 100 మంది మాత్రమే హాజరవ్వాలని స్పష్టం చేసింది. దుకాణాలు, స్పా, షాపింగ్ కాంప్లెక్సులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో 75 శాతం కెపాసిటీ, సినిమాహాళ్లు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, గ్రంథాలయాలు, విద్యాసంస్థల్లో 50 శాతం సామర్థ్యంతో నడిపేందుకు అనుమతించింది. ఈ ఆదేశాలు జనవరి 31 వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కర్ణాటకలో వారాంతపు కర్ఫ్యూ..
Weekend curfew in Karnataka: కరోనా మహమ్మారి కట్టడికి కర్ణాటక ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూ విధించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపునిచ్చారు. ఈ క్రమంలో బెంగళూరులో రోడ్లపైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేస్తూ అనవసరంగా బయటకి వచ్చినవారిపై చర్యలకు ఉపక్రమించారు పోలీసులు.
దిల్లీలోనూ వారాంతపు కర్ఫ్యూ..
Weekend curfew in Delhi: దేశ రాజధాని దిల్లీలో కరోనా కట్టడికి వారాంతపు కర్ఫ్యూ విధించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి. జన్‌పథ్‌లోని దుకాణాలు మూసి వేశారు. ఆయా ప్రాంతాలు మనుషుల సంచారం లేక నిశబ్దంగా మారాయి.
బంగాల్లో ఆంక్షల సడలింపు..
కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను సడలించింది బంగాల్ ప్రభుత్వం. సెలూన్లు, పార్లర్లు రాత్రి 10 వరకు 50 శాతం సామర్థ్యంతో కొనసాగించేందుకు అనుమతించింది.
ఇదీ చూడండి: దేశంలో కరోనా విలయం.. ఒక్కరోజే 1.41లక్షల కేసులు