'దిల్లీలో పుకార్లు వ్యాప్తి చేయకండి.. ఊరుకోము' - దిల్లీ అల్లర్లు
అల్లర్లపై పుకార్లు వ్యాప్తి చేయొద్దని కోరారు దిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ. దేశ రాజధానిలో మత సామరస్యం, శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని సూచించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
!['దిల్లీలో పుకార్లు వ్యాప్తి చేయకండి.. ఊరుకోము' We appeal to people to not spread rumours, disturb peace: Delhi Police chief](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6272164-thumbnail-3x2-delhi.jpg?imwidth=3840)
అల్లర్ల నుంచి కోలుకుంటున్న దిల్లీలో.. పుకార్లు వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని కోరారు దిల్లీ పోలీసు కమిషనర్(శాంతిభద్రతలు) ఎస్ఎన్ శ్రీవాస్తవ. నగరంలో మత సామరస్యాన్ని కాపాడాలని సూచించారు.
అల్లర్లపై తప్పుడు వార్తలతో దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురైన మరుసటి రోజునే కమిషనర్ ఈమేరకు వ్యాఖ్యానించడం. ప్రాధాన్యం సంతరించుకుంది.
పుకార్లు వ్యాప్తి చెందినప్పుడు వాటిలో నిజానిజాలు తేల్చుకునేందుకు తమ కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ చేయాలని సూచించారు శ్రీవాస్తవ.
"కొందరు దేశ విద్రోహులు.. అసత్య ప్రచారాలతో దిల్లీలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి అసత్య సమాచారాలు మీ దృష్టికి వస్తే... మా కేంద్ర, జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయండి. మీ తొందరపాటు వల్ల ఇతరులకు కూడా నష్టం జరిగే అవకాశముంది. ఈ ప్రచారాలపై దిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ట్విట్టర్, టీవీ మాధ్యమాల ద్వారా వీటిని ఖండిస్తున్నాం. పుకార్ల వ్యాప్తిపై ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశాం. ఆకతాయి పనులు, దేశ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం."
- ఎస్ఎన్ శ్రీవాస్తవ, దిల్లీ పోలీస్ కమిషనర్ (శాంతిభద్రతలు)
గత ఆదివారం సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ) అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘర్షణల్లో 47మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:- ఉద్రిక్తతల మధ్య దిల్లీ విద్యార్థులకు 'పరీక్ష'