భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి ఐరాస కృషి చేస్తోంది. ఇరు దేశాల అధికారులతో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సంభాషించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టెఫానీ వెల్లడించారు. అయితే ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, ఇమ్రన్ఖాన్లతో గుటెరస్ సంభాషించలేదని స్పష్టం చేశారు.
పుల్వామా దాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై ఫిబ్రవరి 26న వైమానిక దాడులు జరిపింది భారత్. ప్రతిగా పాక్ వైమానిక దళం ఎఫ్-16 యుద్ధ విమానాలతో భారత్‌పై దాడికి యత్నించింది. భారత్‌కు చెందిన మిగ్-21ను పడగొట్టి పారాషూట్ ద్వారా పాక్‌లో దిగిన పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్న కారణంగా గత శుక్రవారం అభినందన్‌ను పాక్ విడిచిపెట్టింది.
"మాకు పూర్తి సమాచారం ఉంది. కార్యదర్శి గుటెరస్ ఇరు దేశాల ప్రధానులతో ఏ విధమైన సంభాషణ చేయలేదు. కానీ ఆయన ఇరు దేశాల అధికారులతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఎంతదాకైనా వెళ్లేందుకు ఆయన యోచిస్తున్నారు" -స్టెఫానీ డుజారిక్, ఐరాస అధికార ప్రతినిధి
ఉద్రిక్తతలు తగ్గించేందుకు కార్యదర్శి గుటెరస్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నారు డుజారిక్. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేందుకు ఇరు దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు స్టెఫానీ. పుల్వామా దాడిని సైతం ఐరాస ఖండించింది. పిరికిపంద చర్యగా తన ప్రకటనలో పేర్కొంది.