Hyderabad Metro Rail : హైదరాబాద్‌కు మణిహారంగా నిలిచిన మెట్రోరైలు ఏడేళ్లు పూర్తి చేసుకుంది. 69 కిలోమీటర్లతో మూడు కారిడార్లలో రోజుకు 5 లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చుతోంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఎల్అండ్టీ మెట్రో రైలు, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థలు ఏడో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. తొలిదశలో ఎదురైన అనుభవాలు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు గుర్తుచేసుకున్న ఎల్అండ్టీ మెట్రో రైలు ఎండీ కేవీబీరెడ్డి పీపీపీ పద్ధతిలో అత్యంత పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టుగా పేర్కొన్నారు. ఏడేళ్ల నిర్మాణం, ఏడేళ్ల ఆపరేషన్ అనంతరం మెట్రోరైలు 6 వేల కోట్ల నష్టాల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రానున్న మూడు నాలుగేళ్లలో లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కేబీవీ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెట్రోరైలు ఒక్కటే పరిష్కార మార్గమని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. మెట్రోకు మద్దతుగా మిగతా ప్రజారవాణా వ్యవస్థలు నిలిస్తే నగరంలో కాలుష్య రహిత ప్రయాణసేవలు ప్రజలకి మరింత చేరువవుతాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మెట్రో రైలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, కావాల్సిన నిధులు సమకూరుతున్నాయన్నా వివరించారు. త్వరలోనే రెండో దశ పనులు ప్రారంభిస్తామన్న ఎన్వీఎస్‌రెడ్డి, మెట్రో రెండోదశ వల్ల హైదరాబాద్ ప్రపంచంలోనే ఉన్నత నగరాల సరసన చేరి గ్లోబల్ సిటీగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'నగరంలో ట్రాఫిక్‌ను నివారించేందుకు మెట్రో రైలు ఒక్కటే పరిష్కారం. ప్రపంచంలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతుంది. మెట్రో రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం'-ఎన్వీఎస్‌రెడ్డి, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ
ఆ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా మెట్రో : 2017 నవంబర్ 28న ప్రారంభమైన మెట్రో ప్రాజెక్టు పీపీపీ పద్దతిలో ఏడేళ్ల నుంచి విజయవంతంగా నడుస్తున్న ప్రాజెక్టుగా అరుదైన గుర్తింపును దక్కించుకుంది. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశంగా మారింది. 2017లో తొలిదశలో మియపూర్ నుంచి అమీర్‌పేట్, అమీర్‌పేట్ నుంచి నాగోల్ వరకు సేవలను ప్రారంభించారు. 2018లో అమీర్ పేట్- ఎల్బీనగర్, 2019లో అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం, 2020లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు దశలవారీగా మెట్రోని అందుబాటులోకి తీసుకొచ్చారు. సగటున ఒక్కో వ్యక్తి మెట్రోలో 12.5 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారు.
ఏడేళ్లలో 63.5 కోట్ల మంది ప్రయాణం : రీజెనరేటివ్ బ్రేకింగ్ సాంకేతికతో నడుస్తున్న మెట్రోలో ఏడేళ్లలో 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావడం విశేషం. ప్రస్తుతం మెట్రోలోని మూడు కారిడార్లలో రోజుకు సగటున 4.75 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపిన ఎల్అండ్టీ గడిచిన ఏడేళ్లలో 63.5 కోట్ల మంది ప్రయాణించినట్లు వెల్లడించింది. అలాగే 184 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా అయిందని, 424 మిలియన్ కిలోల ఉద్గారాలను తగ్గించి పర్యావరణానికి మేలు చేసినట్లు వివరించింది.
డిపోలు, 32 స్టేషన్ల రూఫ్‌టాప్‌లపై 9.35 ఎండబ్లూపీ సామర్థ్యాలతో సౌర విద్యుత్ ఉత్పత్తి సాధనాలు ఏర్పాటు చేయగా మెట్రోకి 12 శాతం విద్యుత్ అవసరాలను అవి తీరుస్తున్నాయని, ఇప్పటి వరకు 56వేల 935 ఎండబ్లూహెచ్ సౌర విద్యుత్ ఉత్పత్తి అయినట్లు ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేబీవీ రెడ్డి తెలిపారు. ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కస్టమర్ లాయల్టీ ప్రొగ్రామ్‌ను ఆవిష్కరించింది. మెట్రో నాణ్యమైన సేవలనుగాను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్, ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థలకు 5 స్టార్ రేటింగ్ లభించింది.
మెట్రో రెండో దశ పూర్తైతే ట్రాఫిక్ సమస్యలు తీరినట్టేనా?
ఇంకా నిర్లక్ష్యం చేస్తే తొమ్మిదో స్థానానికి పడిపోతాం : ఎన్వీఎస్‌రెడ్డి