దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యత క్షీణించడం పట్ల ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి, దేశం వందేళ్లు వెనక్కి వెళ్లడానికి అనుమతిస్తారా అని ప్రశ్నించింది. వాయు కాలుష్యం కోట్లాది మంది ప్రజల జీవన్మరణ సమస్య అని, దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
"వాయు కాలుష్యంతో ప్రజలు ఇలాగే మరణించేందుకు అంగీకరిస్తారా.? దేశం వందేళ్లు వెనక్కి వెళ్లేందుకు అనుమతిస్తారా? దీనికి ప్రభుత్వాన్నే బాధ్యులుగా చేస్తాం. సంక్షేమ ప్రభుత్వాన్ని మీరు మరిచిపోయారు. మీకు పేద ప్రజల గురించి పట్టింపు లేదు. ఇది దురదృష్టకరం."
-విచారణ సందర్భంగా సుప్రీం
రైతుల నుంచి వ్యవసాయ వ్యర్థాలను ప్రభుత్వం తరఫున ఎందుకు సేకరించడంలేదని రాష్ట్రాలను ప్రశ్నించింది సుప్రీం. వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత, కాలుష్య నియంత్రణపై ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది సర్వోన్నత న్యాయస్థానం. కాలుష్యం కారణంగా ప్రజలు ఏ వ్యాధుల బారిన పడుతున్నారో కూడా గుర్తించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు