దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ ప్రభుత్వ పాలనను చూసి ప్రపంచ దేశాలు ఎద్దేవా చేస్తున్నాయని మండిపడ్డారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేంద్రగఢ్ బహిరంగ సభలో మాట్లాడారు రాహుల్. దేశ ప్రజలను భాజపా విభజించి, పోట్లాడుకునేలా చేస్తోందని ఆరోపించారు.
"ప్రపంచ దేశాలు భారత్‌ను ఎగతాళి చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి మార్గం చూపిన దేశం, ప్రేమతో బతికేవాళ్లం, అభివృద్ధిలో ఉవ్వెత్తున ఎగిశాం. కానీ ఈరోజు.. ఒక వర్గం మరొక వర్గంపై, ఒక మతం మరో మతంపై పోట్లాడుకుంటున్నాయి. మన దేశ గౌరవం, ఆర్థిక వ్యవస్థను మోదీ ధ్వంసం చేశారు.
మోదీ ప్రభుత్వంలో మీడియా భయపడుతోంది. వాళ్లు ఏమంటున్నారంటే.. "మాకు నిజం తెలుసు, కానీ మేం బహిర్గతం చేయలేం. ఎందుకంటే మా ఉద్యోగాలు పోతాయి" అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత