జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌తో దౌత్య సంబంధాలను తెంచుకోనేందుకు పాకిస్థాన్ సిద్ధమయింది. జమ్ముకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ రెండో సారి నిర్వహించిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భేటీలో తీసుకున్న నిర్ణయాలు
- భారత్‌తో దౌత్య సంబంధాలు తెంచుకోవటం
- పాకిస్తాన్ హైకమిషనర్‌ను భారత్‌కు పంపకూడదని నిర్ణయం
- పాక్‌లోని భారత హైకమిషనర్‌నూ వెనక్కి వెళ్లాలని కోరే అవకాశం
- ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం రద్దు
- ద్వైపాక్షిక చర్చలు, సంబంధాలపై పునఃసమీక్ష
భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కశ్మీరీల హక్కులను కాలరాస్తోందని ఇప్పటికే పాకిస్థాన్ విమర్శించింది. కశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ ఉపసంహరించుకున్న తర్వాత పరిణామాలు, అవలంబించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.
జాతీయ భద్రత కమిటీ సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి, కశ్మీర్ వ్యవహారాల మంత్రి, ఇతర ముఖ్య అధికారులతో పాటు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: షోపియాన్ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్