మధ్యప్రదేశ్లో ఓ భాజపా శాసనసభ్యుడికి, ఆయన సతీమణికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మిగిలిన శాసనసభ్యుల గుండెల్లో గుబులు మొదలైంది.
బుధవారం, గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ భాజపా ఎమ్మెల్యే. అదే రోజు, కరోనా సోకిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీపీఈ కిట్ ధరించి ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు.
గురువారం రాత్రి ఒంట్లో నలతగా ఉన్న కారణంగా సతీసమేతంగా వైద్యులను సంప్రదించారు భాజపా ఎమ్మెల్యే. కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు శుక్రవారం రాత్రికే వారిద్దరికీ కరోనా సోకినట్లు నిర్ధరించారు. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాలా లేదా హోం క్వారంటైన్ చేస్తే సరిపోతుందా అని పరిశీలిస్తున్నారు వైద్యులు.
గుండెల్లో గుబులు...
భాజపా ఎమ్మెల్యేకు కరోనా నిర్ధరణ అయిన తర్వాత.. ఆయన్ను కలిసిన శాసనసభ్యులకు భయం మొదలైంది. మంద్సౌర్ భాజపా ఎమ్మెల్యే యశ్పాల్ సింగ్ సిసోడియా సహా మరికొందరు పరుగున వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
అయితే, సమావేశాలు జరిగిన రోజుల్లో అసెంబ్లీ భవనంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు పాటించామన్నారు ఆ రాష్ట్ర శాసనసభా ప్రధాన కార్యదర్శి ఏపీ సింగ్.
" రాజ్యసభ ఎన్నికల వేళ అసెంబ్లీలో అన్ని రకాల కరోనా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి 15 -20 నిమిషాలకు భవనాన్ని శానిటైజ్ చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కరోనా సోకిన ఎమ్మెల్యేలను కలిసిన వారిని కనిపెట్టేందుకు... సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నాం. "
-ఏపీ సింగ్, మధ్యప్రదేస్ అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీ.
ఇదీ చదవండి: కరోనా ఉన్నా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే