కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వానికి సాయం చేయటానికి దేశవ్యాప్తంగా సుమారు 38 వేలమందికి పైగా వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వైరస్ నియంత్రణకు తమకు సహకరించాల్సిందిగా మార్చి 25న వైద్యులు, రిటైరైన వారికి కేంద్రం పిలుపునిచ్చింది. వారి పేర్లను నీతి అయోగ్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది.
కేంద్రం పిలుపు మేరకు 38 వేల 162 మంది స్వచ్ఛందంగా తమ పేరును నమోదు చేసుకున్నారు. వీరి జాబితాను నీతి అయోగ్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి పంపినట్లు అధికారులు తెలిపారు
"కొవిడ్-19పై పోరాటం చేసేందుకు, కేంద్రాని సాయం చేసేందుకు సాయుధ బలగాల్లో వైద్య సేవలు అందించిన విశ్రాంత వైద్యులు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులతో సహా మొత్తం 38,162 మంది ముందుకువచ్చారు."
- కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి.
అమెరికా, ఇటలీ, బ్రిటన్, వియత్నాం వంటి దేశాలు కూడా కరోనా మహమ్మారి పోరుకు సాయం చేయాలని పదవీ విరమణ చేసిన వైద్యులను కోరాయి.