బంగాల్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రైళ్ల దాడి జరిగిన ఒక రోజు అనంతరం.. ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీకి కేంద్ర హోంశాఖ సమన్లు జారీ చేసింది. ఈ నెల 14న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఘటనకు గల కారణాలతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలపై హోంశాఖ ప్రశ్నలు సంధించే అవకాశముంది.
గురువారం.. జేపీ నడ్డా దక్షిణ 24 పరగణాల జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్‌పై గుర్తుతెలియన వ్యక్తులు రాళ్ల దాడి జరిపారు. ఈ ఘటనలో నడ్డా సురక్షితంగా బయటపడగా.. పలువురు భాజపా నేతలు గాయపడ్డారు.
గవర్నర్ నివేదిక...
రాళ్ల దాడి ఘటనపై కేంద్ర హోంశాఖకు శుక్రవారం నివేదిక అందించారు బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధనకర్. నివేదికను పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై ఆ నివేదికలో గవర్నర్ సవివరంగా విశ్లేషించినట్టు సమాచారం.
ఘటనకు సంబంధించి నివేదిక పంపాలని గవర్నర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హోంశాఖ. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నివేదిక అందలేదని అధికారులు స్పష్టం చేశారు.
'పరిస్థితులు దారుణంగా ఉన్నాయి'
జేపీ నడ్డా కన్వాయ్‌పై రాళ్ల దాడి నేపథ్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు గవర్నర్ ధనకర్. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, రోజురోజుకు దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని సూచించారు. నేతలపై రాళ్ల దాడి వంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే మచ్చ అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- త్వరలో బంగాల్ పర్యటనకు అమిత్ షా!