కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యటక ప్రదేశం హంపి. దీని తరువాత అంతటి ఖ్యాతిని సొంతం చేసుకునే దిశగా.. పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఓ గ్లాస్ హౌస్. దేశంలోనే అతిపెద్ద అద్దాల గృహంగా పేరుగాంచిన ఈ నిర్మాణాన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివస్తున్నారు సందర్శకులు. దీన్ని వీక్షించేందుకు విదేశీయులూ క్యూ కట్టడం విశేషం.
భూలోక స్వర్గంలా..
పర్యటకులను మైమరిపించే ఈ అద్భుతమైన అద్దాల గృహం.. దావణగెరెలోని నాలుగో నంబర్ జాతీయ రహదారిపై ఉంది. ప్రముఖ కుందవాడ సరస్సు సమీపంలో నిర్మితమైన ఈ అందమైన అద్దాల మేడ.. అలా కాలు మోపగానే ఇలా మైమరిచిపోయేలా ఆకర్షిస్తోందట. ఒక్కమాటలో చెప్పాలంటే భూలోక స్వర్గాన్ని తలపించేలా ఉందంటూ కొనియాడుతున్నారు దీన్ని చూసిన పర్యటకులు.
"నేను ఐర్లాండ్‌లో ఉంటున్నాను. నా మిత్రుడి పెళ్లి కోసం ఇక్కడకు వచ్చాను. వారి సాయంతోనే ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చా. ఇందులోని తోటలు చాలా అందంగా ఉన్నాయి. ప్రశాంతమైన ఈ వాతావరణం.. ధ్యానం చేసేందుకు ఉత్తమ ప్రదేశంగా అనిపిస్తోంది."
- అమోఘ్, ఐర్లాండ్‌లో భారత సంతతి వ్యక్తి
"మేమీ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు కొప్పల్(కర్ణాటక) నుంచి ఇక్కడకు వచ్చాం. ఈ గ్లాస్ హౌస్ లోపలికి ప్రవేశించగానే స్వర్గాన్ని తలపిస్తోంది. ఇందులోని వాతావరణం, చుట్టూ నాటిన మొక్కలు పర్యటకులను మైమరిచిపోయేలా చేస్తున్నాయి."
- ఉషా,పర్యటకురాలు, కొప్పల్ జిల్లా, కర్ణాటక
గ్లాస్ హౌస్.. జాతీయ రహదారికి అతి చేరువలో ఉండటం వల్ల ఎక్కువ మంది సందర్శకులు విశ్రాంతి కోసం వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొప్పల్, హుబ్లి-ధార్వాడ్, హవేరి, దావణగెరె, బెల్గాం, షిమోగా ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో ఈ గ్లాస్ హౌస్‌ను చూసేందుకు తరలివస్తున్నారట. థాయిలాండ్, ఐర్లాండ్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులూ దీన్ని సందర్శించేందుకు వస్తున్నారంటే.. ఈ అద్దాల గృహం గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు.
ఇవీ ప్రత్యేకతలు..
ఈ గ్లాస్ హౌస్‌లో ఉద్యాన సమాచార కేంద్రం ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించేందుకు ఇందులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇక ఈ గ్లాస్ హౌస్ తోటలో అలంకరించిన అందమైన విదేశీ మొక్కలు, చెట్లు.. చూపరులను తమవైపునకు తిప్పుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాత్రి పూట రంగురంగుల్లో ప్రకాశించేలా ప్రత్యేక లైట్లను అమర్చారు.
నిర్మాణం జరిగిందిలా..
రూ. 30కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ హౌస్ పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 108, 68, 18 మీటర్లు. దీని నిర్మాణ పనులు.. 2014లో ప్రారంభమై గతేడాదే ముగిశాయి.
ఇదీ చదవండి: ఔరా! ట్రాక్టర్‌నే కుంచె చేసి.. అద్భుతమైన బొమ్మ గీసి..