కశ్మీర్‌లో ఆంక్షలు విధించడం వల్లే ఎక్కడా హింసాత్మక ఘటనలు చెలరేగలేదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. జమ్ముకశ్మీర్లో రవాణా, సమాచార వ్యవస్థపై విధించిన ఆంక్షల ఎత్తివేత స్థానిక యంత్రాంగం నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు.
జమ్ముకశ్మీర్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను క్షణ్నంగా పరిశీలించిన తర్వాతే మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీని విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు ఆ అధికారి. కశ్మీర్‌లో ప్రజల ఇబ్బందులు, అసౌకర్యాలను ప్రభుత్వం గమనిస్తూనే ఉందని తెలిపారు. కొద్ది రోజుల్లోనే వారి ఇక్కట్లు తొలగిపోతాయని ధీమా వ్యక్తంచేశారు.
జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండూ అక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతాలుగా మారే అవకాశం ఉందన్నారు. ఆస్తుల పంపిణీ, అధికారుల విభజన తదితర అంశాలకు ఈ సమయం పడుతుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ అధికారి.
త్వరలోనే...
స్వతంత్ర దినోత్సవ కసరత్తులు పూర్తైన తర్వాత కశ్మీర్‌లో ఆంక్షలను సడలిస్తామని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రోహిత్ కన్సాల్ స్పష్టంచేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించినట్లు ఆయన చెప్పారు. జమ్ము ప్రాంతంలో ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: వైరల్: దివ్యాంగులకు బూట్లు తొడిగిన మంత్రి