అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ రోజు మంత్రిని కాకపోయి ఉంటే.. ఎయిరిండియాను కొనుగోలు చేసేవాడినని అన్నారు.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2020 వార్షిక సదస్సుకు హాజరైన పీయుష్.. 'స్ట్రాటజిక్ అవుట్‌లుక్: ఇండియా' అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిరిండియా, భారత్ పెట్రోలియం తదితర ప్రభుత్వరంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనల గురించి ప్రస్తావించారు.
ప్రభుత్వ కంపెనీలపై దృష్టి పెట్టాలి!
దేశానికి ఆణిముత్యాల్లాంటి ఈ కంపెనీలపై కేంద్రం దృష్టిపెట్టకపోతే వాటి విలువ తరిగిపోతుందని అభిప్రాయపడ్డారు గోయల్. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు.
'ఈ రోజు నేను కేంద్రమంత్రిని కాకపోయి ఉంటే ఎయిరిండియా కొనుగోలుకు బిడ్డింగ్ వేసేవాడిని. సమర్థవంతమైన నిర్వహణతో సేవలు అందిస్తున్న ఎయిరిండియా నా దృష్టిలో బంగారు గని కంటే తక్కువేం కాదు' అని పీయుష్ గోయల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్‌లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలున్నాయని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు లొంగిపోయిన 644 మంది ఉగ్రవాదులు