దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలసకూలీల నుంచి ధనికుల వరకు అందరిపైనా ఈ ప్రభావం పడింది. తాజాగా సరోగసి ద్వారా జన్మించిన తమ నవజాత శిశువును 17రోజుల తర్వాత చూడగలిగారు బెంగళూరుకు చెందిన దంపతులు. ఆ పాపను చూసిన తర్వాత వారి ఆనందానికి అవధుల్లేవు.
సూరత్ నుంచి బెంగళూరు వరకు...
సరోగసి ద్వారా సంతానం పొందేందుకు ఏడాది క్రితం గుజరాత్‌కు చెందిన సూరత్‌లోని ఓ ఆసుపత్రిని సంప్రదించారు బెంగళూరుకు చెందిన ఓ జంట. ఈ నెల 29న సూరత్‌లో శిశువు జన్మించింది. కానీ లాక్డౌన్ వల్ల తల్లిదండ్రులు వెంటనే ఆ పాపను చూడలేకపోయారు. 17రోజుల అనంతరం ఎయిర్ అంబులెన్స్‌లో ఆ ఆడ బిడ్డను.. బెంగళూరులోని దంపతుల వద్దకు చేర్చగలిగారు వైద్యులు. ఆపరేషన్ చేసిన వైద్యురాలు పూజా నంద్కర్ని సింగ్.. స్వయంగా ఎయిర్ అంబులెన్స్‌లోని డాక్టర్లకు శిశువును అప్పగించారు.
శిశివు భద్రతకు తగిన ఏర్పాట్లు చేసినట్టు అహ్మదాబాద్ విమానాశ్రయం డైరక్టర్ అమన్ సైనీ తెలిపారు.
"ఎయిర్ అంబులెన్స్ దిల్లీ నుంచి వచ్చింది. శిశువు భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్యాసింజర్ విమానాలు రద్దు అయిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర సేవలకు అనుమతి ఉంది. శిశువును బెంగళూరులోని తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చగలిగాం."
--- అమన్ సైనీ, అహ్మదాబాద్ విమానాశ్రయం డైరక్టర్.