కేరళ వయనాడ్‌లోని మీనన్గాడిలో ఓ ప్రైవేటు బస్సు కండక్టర్, డ్రైవర్ల దురుసు ప్రవర్తనకు.. తండ్రి కూతుళ్ల జీవితాల్లో విషాదం నింపింది. బస్‌స్టాప్‌లో దిగకముందే బస్సు ముందుకు కదిపి.. కూమార్తె కిందపడిపోవడానికి కారణమైన డ్రైవర్‌ను ప్రశ్నించినందుకు తండ్రిని కిందకు నెట్టేశాడు కండక్టర్. దీంతో అతడి కాళ్లపై నుంచి బస్సు చక్రాలు దూసుకెళ్లాయి. కుమార్తె ముందే చక్రాల కింద అతడి కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.
ఇదీ జరిగింది..
జిలాల్లోని కరియంబాదీకి చెందిన జోసెఫ్.. కుమార్తె నీతూతో కలిసి ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నాడు. తాము దిగే స్టాప్ రాగానే జోసెఫ్ దిగేశాడు. రద్దీగా ఉన్న ఆ బస్సులోంచి కిందకు దిగబోయింది నీతూ.. అంతలోనే బస్సును ముందుకు నడిపాడు డ్రైవర్. నీతూ కిందపడిపోవటం వల్ల స్వల్పంగా గాయపడిందిం. కూతురిని గాయపరిచినందుకు ఆగ్రహంగా మళ్లీ బస్సు ఎక్కబోయాడు జోసెఫ్.
కానీ, కండక్టర్ దురహంకారంతో హ్యాండిల్‌ను పట్టుకున్న జోసెఫ్ చేతిని నెట్టేశాడు. దీంతో ఆయన కిందపడిపోయాడు.. డ్రైవర్ అప్పటికీ బస్సు వేగాన్ని తగ్గించలేదు.. దీంతో జోసెఫ్ కాళ్ల మీది నుంచే బస్సు చక్రాలు వెళ్లాయి. జోసెఫ్ మోకాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రస్తుతం తండ్రీకూతుళ్లు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.