సమాచార హక్కు చట్ట సవరణ బిల్లుపై పార్లమెంటులో వివాదం అంతా ఇంతా కాదు. విపక్ష పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. అయితే ప్రభుత్వానికి తగిన బలం ఉన్నందున ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర లభించింది. ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా మాజీ ప్రధాన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా ముఖ్యమంత్రులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె. చంద్రశేఖర్ రావు, నవీన్ పట్నాయక్‌కు ఈ లేఖ పంపారు.
ముగ్గురు ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాల హక్కులు, సమస్యల కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేశారని ప్రస్తావిస్తూ కొన్ని ప్రశ్నలు సంధించారు శ్రీధర్.
"ఈ ప్రశ్నలకు నైతికంగా, చట్టపరంగా (ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4(1)(సీ) ప్రకారం), రాజ్యాంగం పరంగా (సమాఖ్య సూత్రాల ప్రకారం), రాజకీయంగా (రాష్ట్ర అధికారాలను, హక్కులను కేంద్రం హరిస్తే పోరాటం చేస్తామని మీరు చెప్పారు కనుక) సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విరుద్ధంగా, అన్యాయంగా మీ అధికారాలను దిల్లీ చేతిలో పెట్టారు. రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం, పదవీకాలం తదితర అంశాల్లో ఇక రాష్ట్రాలకు అధికారం లేదు. రాజ్యాంగేతర బిల్లుకు మద్దతు పలకడం ద్వారా మీరు ఏం సాధించారో చెప్పండి."
- లేఖ సారాంశం
ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ బిల్లుకు మద్దతిచ్చిన విషయంపై సమగ్ర వివరణ ఇవ్వాలని లేఖలో ఆచార్యులు పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: ఆజంఖాన్ బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందే!