హరియాణా నూహ్ జిల్లాలోని కిరూరి గ్రామం. జాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతం.. లింగ నిష్పత్తిలో భారీ అంతరానికి పెట్టింది పేరు. ఇప్పుడీ జిల్లా లింగ అసమానతలను తగ్గించేందుకు నడుంకట్టింది. పురుషాధిక్యతకు చెల్లుచీటీ చెబుతూ కూతుళ్లకు పట్టం కడుతోంది. 250 కుటుంబాలతో 1200 జనాభా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు తమ ఇంటి ఆడపడుచుల పేర్లతో ప్రసిద్ధికెక్కింది. లక్ష్మీ నివాస్, ఆనంది నిలయం, ప్రశాంతి నిలయం ఇలా.. ఏ ఇంటి ముందు చూసినా కూతుళ్ల పేర్లతోనే బోర్డులు కనిపించడం ఈ ఊరు ప్రత్యేకత. ఈ తరహా విధానం పాటిస్తున్న దేశంలోనే తొలి గ్రామంగా అరుదైన ఘనతనూ అందుకుంది.
"ఈ కాలంలో అమ్మాయిలు ప్రతి రంగంలోనూ ప్రగతి సాధిస్తున్నారు. వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఇంటికీ మహిళ పేరుతో నేమ్ప్లేట్లు పెడుతున్నారు. అంటే మహిళలకు ఇళ్లలో గుర్తింపు ఇస్తున్నారని దానర్థం."
-- వందన, కిరూరి గ్రామ విద్యార్థిని
కుటుంబాల్లో కుమార్తెలు భాగం కాదని సమాజంలో ఓ అభిప్రాయముంది. అయితే కిరూరి గ్రామంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా కూతుళ్లకు తగిన గౌరవం ఇస్తూ ఔరా అనిపించుకుంటున్నారు.
"గ్రామం మొత్తం కూతుళ్ల పేరుమీద నేమ్ప్లేట్లు పెడుతుంటే ఆనందంగా అనిపిస్తోంది. మా గ్రామానికి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు రావడం సంతోషంగా ఉంది."
-- మహేంద్ర, గ్రామ నివాసి
ఈ ప్రచారం వెనుక అందమైన, ప్రగతిశీల ఆలోచన ఉంది. 'సెల్ఫీ విత్ డాటర్' కార్యక్రమంతో పేరుతెచ్చుకున్న మాజీ సర్పంచ్ దీన్ని ప్రారంభించారు. లడో స్వాభిమాన్ ఉత్సవ్‌గా పేరుపెట్టారు. తండ్రి ఆస్తిలో మహిళల హక్కును సమాజం గుర్తించట్లేదు. ఒకవేళ కూతుళ్ల పేర్లతో ఇళ్లకు గుర్తింపునిస్తే ఆ ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంది. ఇదే ఈ ప్రచారం వెనుక ఉన్న ఉద్దేశం.
"స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్లయినా రాజ్యాంగం ప్రకారం మహిళలకు తమ ఇంటిలో వాటా దక్కట్లేదు. అయితే లడో స్వాభిమాన్ ఉత్సవ్‌లో భాగంగా మేము రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారికి హక్కులు కల్పించాలని ప్రయత్నిస్తున్నాం."
-- సునీల్ జగ్లన్, కిరూరీ గ్రామ మాజీ సర్పంచ్
తన పేరుతో నేమ్‌ప్లేటు ఇదిగో అంటూ సంతోషంగా చూపించింది కిరూరీ గ్రామానికి చెందిన నీషూ. ఈ ప్రచారం తన అమ్మ, అమ్మమ్మ రోజుల్లో జరగలేదని, ఇప్పుడు జరుగుతున్నందుకు గర్వంగా ఉందని చెప్పింది. మరో అమ్మాయి వందన కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఉత్సవం వల్ల తన తల్లిందండ్రుల కన్నా తాము చాలా సంతోషంగా ఉన్నామని వెల్లడించింది.
"కూతుళ్లకు ఇంత గౌరవం లభిస్తుంటే ఆనందంగా ఉంది. మొదటిసారి మేము అమ్మాయిల పేర్లతో ఉన్న ఇళ్లు చూస్తున్నాం. మా అత్తమ్మలు, అమ్మమ్మలు ఇంత గౌరవం పొందడం మేం ఎప్పుడూ చూడలేదు."
-- నీషూ, పాఠశాల విద్యార్థిని
"కూతుళ్ల పేర్లతో నేమ్ప్లేట్లను చూస్తుంటే చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తోంది. కుమార్తెలు తల్లిదండ్రులకు గర్వకారణం."
-- అరుణా రాణి, స్థానికురాలు
ఇప్పటికీ ఈ రాష్ట్రంలో మహిళలు, కుమార్తెలు చీర చాటున ముఖం దాచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి రాష్ట్రంలోనే ఈ ప్రచారం ప్రారంభంకావడం విశేషం. ఇది హరియాణాలోనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని ప్రతిచోటా విస్తరించాలి. అప్పుడే మహిళలు పురోగతి సాధించాలన్న ఆలోచనలకు మరింత ఊతం లభిస్తుంది.