జనవరి 5న జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం వీసీ మామిడాల జగదీశ్‌కుమార్ రాజీనామాకు పలువురు డిమాండ్ చేశారు. అయితే రాజీనామా డిమాండ్లకు విలువ లేదని పేర్కొన్నారు జగదీశ్. వర్సిటీ అభివృద్ధి కోసం వీసీగా తన బాధ్యతలను కొనసాగిస్తానన్నారు. మెజారిటీ సంఖ్యలో విద్యార్థులు, ప్రొఫెసర్లు వారి పని వారు చేస్తున్నారన్నారు. కొంతమంది మాత్రమే వర్సిటీని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
'నా పనిని కొనసాగిస్తా'
వార్తా ఛానెళ్లలో జేఎన్‌యూను ప్రధానంగా చూడాలని అనుకోవడం లేదన్నారు జగదీశ్. ప్రపంచంలోని అత్యుత్తమ 100 విశ్వవిద్యాలయాల్లో జేఎన్‌యూను నిలపడమే తన లక్ష్యమన్నారు. 2016లో వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే పలువురు తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారన్నారు. పలు సంస్కరణలు ప్రవేశపెట్టడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. ఘటనలపై వీసీ స్పందించడం లేదన్న ఆరోపణలకూ సమాధానమిచ్చారు జగదీశ్. పాలనాధికారుల్లో వివిధ శ్రేణులుంటాయని చెప్పారు.
"మేం ఏ వివాదంలోకి వెళ్లదల్చుకోలేదు. ధర్నాలు, ఆందోళనలకు కొంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థులదే బాధ్యత."
- జగదీశ్ కుమార్, జేఎన్‌యూ వీసీ
'సమాచార కేంద్రం' ధ్వంసానికి యత్నించారు..
వర్సిటీ పట్ల దురుద్దేశాలు ఉన్న పలువురు విద్యార్థులు శీతకాల రిజిస్ట్రేషన్లు జరగకూడదని కోరుకున్నారని ఆరోపించారు జగదీశ్ కుమార్.
"జనవరి 5న ముసుగు వ్యక్తులు వర్సిటీ సమాచార కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దిల్లీ పోలీసుల విచారణ పూర్తయ్యాకే ఘటనపై చర్యలు తీసుకుంటాం."
- జగదీశ్ కుమార్, జేఎన్‌యూ వీసీ
'ముందే పోలీసులను పిలవలేను'
జనవరి 5న వర్సిటీలో ఆగంతుకుల దాడి సందర్భంలో వెంటనే పోలీసులను పిలవలేదనే ఆరోపణలకు సమాధానమిచ్చారు జగదీశ్. ఘర్షణ గురించి కచ్చితమైన సమాచారం అందాకే పోలీసులకు సమాచారమిచ్చానన్నారు.
"ఘర్షణపై సమాచారం తెలిసిన వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించాను. అక్కడికి చేరుకున్న అనంతరం ఆగంతుకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారమిచ్చారు సిబ్బంది. ఆ వెంటనే నేను డీసీపీ, కమిషనర్లకు సమాచారమిచ్చాను."
- జగదీశ్ కుమార్, జేఎన్‌యూ వీసీ
'చక్కగా నడుపుతున్నాం- విద్యార్థుల ఆందోళనలు సరికాదు'
గత రెండు నెలలుగా ఫీజుల పెంపుపై విద్యార్థులు ఆందోళనలు చేయడం పట్ల స్పందించారు జగదీశ్‌కుమార్. వర్సిటీ ఆర్థిక స్థితిని విద్యార్థులకు వివరించామన్నారు.
"నీరు, విద్యుత్ వంటి ఖర్చులు మా అంతర్గత వ్యయం కిందకు వస్తాయని యూజీసీ మార్గదర్శకాలు ఇచ్చింది. మేం విద్యార్థులు, మానవ వనరుల శాఖల అభిప్రాయాలు తీసుకున్నాం. వ్యయాలను పూరించేందుకు యూజీసీకి నివేదించాం. వినియోగ, సేవల ఛార్జీలను తగ్గించాం. ఆర్థికంగా వెనకబడిన వారికి హాస్టల్ ఫీజు రూ. 150 గా నిర్ణయించాం. ఇలా మేం పలు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంతమంది విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఇది సరికాదు."
- జగదీశ్ కుమార్, జేఎన్‌యూ వీసీ
ఇదీ చూడండి: మిర్చి ఘాటు అదిరింది.. రూ.33 వేలు రేటు పలికింది!