దేశంలో లాక్డౌన్ విధించటం వల్ల బహుళ ప్రయోజనాలు కలిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ముఖ్యంగా కరోనా విజృంభించకుండా అడ్డుకట్ట పడిందని వెల్లడించింది.
"లాక్డౌన్ వల్ల బహుళ ప్రయోజనాల కలిగాయి. ముఖ్యంగా కేసులు పెరగకుండా నియంత్రించగలిగాం. కరోనా కట్టడికి తీసుకున్న పలు కార్యక్రమాల వల్ల పెద్ద సంఖ్యలో మరణాలు, కేసులు పెరగకుండా నివారించగలిగాం."
-కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,337 మంది మృతిచెందగా... లక్షా 51వేల 767 మంది వైరస్ బారినపడ్డారు.
లాక్డౌన్ సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆన్లైన్ ట్రైనింగ్, వెబినార్స్ ద్వారా మానవ వనరుల సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోవటం, కరోనా పరీక్షల సామర్ధ్యాన్ని పెంచుకోవటం వంటిని చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఆరోగ్య సేతుతో వైరస్ బాధితులను గుర్తించటం ద్వారా దేశంలో సాంకేతికతను పెంచుకున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 27 నాటికి 1,58,747 ఐసోలేషన్ పడకలు, 20వేల 355 ఐసీయూ పడకలు, 69వేల 076 ఆక్సిజన్‌తో కూడిన పడకలతో మొత్తం దేశవ్యాప్తంగా 930 కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది ఆరోగ్యశాఖ. అలాగే 2,362 కొవిడ్ హెల్త్ సెంటర్లు, మరో 10,341 నిర్బంధ కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొత్తం 113.58 లక్షల ఎన్-95 మాస్కులు, 89.84 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించినట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. పరీక్షా సామర్ధ్యం పెంచటానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లతో మొత్తం 624 ల్యాబోరేటరీలకు అనుమతినిచ్చినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ మరణాల రేటు 6.36 శాతంగా ఉంటే, దేశంలో 2.86 శాతంగా ఉందని పేర్కొంది.
రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు...
రాష్ట్రం | నేటి కేసులు | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
మహారాష్ట్ర | 2,190 | 56,948 | 1,897 |
తమిళనాడు | 817 | 18,545 | 133 |
గుజరాత్ | 376 | 15,205 | 938 |
దిల్లీ | 792 | 15,000 | 303 |
రాజస్థాన్ | 109 | 7,645 | 172 |
మధ్యప్రదేశ్ | 237 | 7,261 | 330 |