కేంద్ర మంత్రుల అవినీతి సంబంధించిన కీలక అప్పీలుపై వాదనలను కేంద్ర సమాచార కార్యాలయం(సీఐసీ) వాయిదా వేసింది. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వటానికి ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నిరాకరించిన విషయంలో ఈ పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం వాదనలు వినాల్సి ఉన్నా సమయాభావం కారణంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సీఐసీ.
కేంద్రమంత్రులపై వచ్చిన ఆరోపణల వివరాలు అందివ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద ప్రజావేగు, ప్రభుత్వోద్యోగి సంజీవ్ చతుర్వేది దరఖాస్తు చేశారు. ఈ విషయమై వివరాలు ఇవ్వాలంటూ సీఐసీ ఆదేశాలున్నా పీఎంఓ అందుకు నిరాకరించింది.
"కేంద్ర మంత్రులపై వివిధ రకాల ఫిర్యాదులు వస్తాయి. అందులో అవినీతితో పాటు ఇతర విషయాలూ ఉంటాయి. వీటిని వర్గీకరించటం క్లిష్టమైన విషయం" అంటూ సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(9)ను ఉటంకించింది పీఎంఓ.
ఈ సెక్షన్ ప్రకారం సమాచారాన్ని అడిగిన రూపంలోనే అందించాలి. అభ్యర్థనతో ప్రభుత్వ వనరులు, వాటి రక్షణకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లయితే సమాచారం ఇచ్చేందుకు విముఖత చూపేందుకు ఆ విభాగానికి అధికారం ఉంటుంది.
ఇదీ చూడండి: ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు