ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌పై అనిరుధ్ అరుణ్ అనే రచయిత పుస్తకం రాశారు. మహమ్మారి నుంచి కోలుకున్న వ్యక్తి కథపై 'PLAGUED' అనే పుస్తకం రాయటమే కాదు.. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని పీఎం కేర్స్‌కు విరాళంగా అందజేస్తానని చెప్పారు.
కరోనా నేపథ్యంలో సాగే ఈ పుస్తకంలో.. మనుషులు ధైర్యం కోల్పోకుండా ఉండాలని, అలాగే నమ్మకంతో ముందుకు సాగాలని చెప్పినట్లు అనిరుధ్ తెలిపారు. మానవాళికే ప్రశ్నార్థకంగా మారిన ఈ మహమ్మారి, వివిధ దేశాల్లో ఎలాంటి ప్రభావం చూపించిందనే అంశాల్ని ప్రస్తావించానన్నారు. సమకాలీన అంశాలు, వాస్తవిక పరిస్థితులతో పాటు భవిష్యత్‌లో చోటుచేసుకునే భౌగోళిక రాజకీయాలను సైతం అందులో పేర్కొన్నట్లు చెప్పారు.
వారికి అంకితం..
ఈ పుస్తకాన్ని వైద్య ఆరోగ్య సిబ్బందికి, అత్యవసర విభాగాల్లో పనిచేసేవారికి అంకితమిస్తున్నట్లు రచయిత వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఇళ్లల్లోనే జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. సిలికాన్‌వ్యాలీలో నివసించే వేద్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఇతనికి వైరస్ సోకుతుందని వివరించారు. అలాగే చైనా, అమెరికాల్లో ఉండే తన మిత్రులు కూడా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడతారని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్నేహితులంతా ఎక్కడెక్కడో ఉన్నా కరోనాతో పోరాడుతుంటారని రచయిత చెప్పుకొచ్చారు. అలాగే కరోనాతో సంభవించే ఆర్థిక నష్టాలను, ఉద్యోగ కోతలను సైతం ఇందులో ప్రస్తావించినట్లు అనిరుధ్ తెలిపారు. ఇది ఈ-పుస్తకమని, కేవలం అమెజాన్ కిండిల్‌లో మాత్రమే లభిస్తుందని చెప్పారు. దీని ధర 149గా రచయిత పేర్కొన్నారు.