చంకలో చంటి బిడ్డ, నెత్తిపై బియ్యం మూట.. ఆపై ఎర్రటి ఎండలో నడక. ఎదురుగా వచ్చే వడగాలుల నుంచి కన్నబిడ్డను కాపాడేందుకు గొడుగుతో పోరాటం. ఇదంతా తన నడక దారిలో ఓ వలస కార్మికుడు పడుతున్న కన్నీటి కష్టాలు. లాక్డౌన్ కారణంగా మహారాష్ట్ర వాషిమ్ జిల్లాకు చెందిన దోయి రాథోడ్.. 16 రోజులుగా తన భార్య , చంటి బిడ్డతో కాలినడక ప్రయాణం చేస్తున్నాడు. ఉపాధి కోసం ముంబయి వెళ్లిన ఈ జంట అక్కడ పని లేనందున ఇంటి ముఖం పట్టారు. సొంతూరు వెళ్లాలంటే 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. ఇప్పటివరకు తమ బిడ్డతో కలిసి దాదాపు సగం దూరం నడిచిన దోయి జంట.. తమ సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
'కనికరం చూపట్లేదు'
ముంబయిలో పెరుగుతున్న కరోనా రోగులతో కలత చెందిన దోయి రాథోడ్... తన బిడ్డను కాపాడుకునేందుకే ఇంటికి పయనమైనట్లు చెప్పాడు. తన భార్య చీరతో చేసిన జోలెలో శిశువును ఉంచి నడుముకు కట్టుకున్నట్లు తెలిపాడు. ఎదురుగా వచ్చే వడగాలుల నుంచి బిడ్డను కాపాడేందుకు గొడుగు అడ్డుపెట్టినట్లు వివరించాడు. మార్గం మధ్యలో కాసేపు సేదతీరుతూ బిడ్డ ఉన్న జోలెను మార్చుకుంటునట్లు తెలిపాడు. రాత్రివేళ కూడా తమ ప్రయాణాన్ని సాగిస్తునట్లు చెప్పిన రాథోడ్.. చంటి బిడ్డను చూసైనా ఎవరూ తమ పట్ల కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే చాలా దూరం ప్రయాణించామని... మరి కొంత దూరం వెళ్తే ఇళ్లు చేరుకుంటామని చెప్పాడు.
ఇదీ చదవండి: ముంబయికి ఫ్లెమింగో వలస పక్షుల తాకిడి!