కేరళ వయనాడ్ సరిహద్దులోని మెప్పాడి పుథుమాల ప్రాంతంలో కొండచరియలు విరిగిన ఘటనలో తాజాగా మరో 60 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరితో సహా మొత్తం 100 మందిని జాతీయ విపత్తు స్పందన దళం కాపాడినట్లు అధికారులు తెలిపారు.
ఏం జరిగింది..?
కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి వయనాడ్ అతలాకుతలం అవుతోంది. గురువారం సాయంత్రం వయనాడ్ సరిహద్దులోని మెప్పాడి పుథుమాల ప్రాంతంలోని పాడి ఎస్టేట్ సమీపంలో ఉన్న ఆలయం.. నీరు, ఇసుకతో నిండిపోయి ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కొండ చరియలు విరిగి పడటం వల్ల ఆ ఆలయం, స్థానిక కూలీలకు చెందిన శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ చరియల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి నిన్న సాయంత్రం నుంచి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
మోదీకి రాహుల్ ఫోన్...
తన నియోజకవర్గమైన వయనాడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ ద్వారా వయనాడ్ పరిస్థితి వివరించినట్లు పేర్కొన్నారు. కేంద్రం సహాయం చేయాలని మోదీని కోరినట్లు ట్వీట్ చేశారు.