Man Kills Mother And Four Sisters : ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని ఓ హోటల్ గదిలో ఓ వ్యక్తి తన తల్లిని, నలుగురు చెల్లెళ్లను హత్య చేసిన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వారిని హత్య చేసిన అనంతరం నిందితుడు అర్షద్ విడుదల చేసిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. కొందరు వ్యక్తులు తన చెల్లెళ్లను ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని, అందువల్లే తన తండ్రితో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టానని వెల్లడించాడు
"మా పొరుగున ఉన్న వ్యక్తులనుంచి వచ్చిన వేధింపుల కారణంగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాను. నా తల్లి, తోబుట్టువులను నేను చంపేశాను. ఈ వీడియో పోలీసులకు అందగానే బాధ్యులు ఎవరో తప్పక తెలిసిపోతుంది. మా ఇల్లు కబ్జా చేయాలనిచూశారు. వారి ఆక్రమణలను అడ్డుకునేందుకు యత్నించాం. కానీ మా మాట ఎవరూ వినలేదు. 15 రోజులుగా చలిలో తిరుగుతూ, ఫుట్‌పాత్ మీదే నిద్రపోతున్నాం. పిల్లలు అలా చలిలో తిరగడం నచ్చలేదు. పత్రాలు మావద్దే ఉన్నా ఇప్పటికే సగం ఇల్లు వారి చేతిలోకి వెళ్లిపోయింది" అని అర్షద్ ఆ వీడియోలో వెల్లడించాడు. మణికట్టు నరాలు కోసి, ఊపిరాడకుండా చేసి వారిని చంపినట్లు చెప్పాడు. వారి మృతదేహాలను వీడియోలో చూపించాడు.
తమ కుటుంబ పరిస్థితికికారణమైన పలువురి పేర్లను వెల్లడించాడు. "వారంతా లాండ్ మాఫియాలో భాగం. వారు ఆడపిల్లలను అమ్మేస్తుంటారు. నా తండ్రిని, నన్ను తప్పుడు కేసులో ఇరికించి, నా చెల్లెళ్లను అమ్మేయాలనుకున్నారు. వాళ్లను హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముతుంటే మేం చూడాలా..? అలాంటి పరిస్థితి మాకు రాకూడదు అనుకున్నాం. అందుకే వారిని చంపేశా. ఉదయం కల్లా నేను కూడా బతికి ఉండకపోవచ్చు. మేం బదాయూ ప్రాంతం వాళ్లం. మా సమీప బంధువు వద్ద ఇంటికి సంబంధించిన ఆధారాలున్నాయి. మేం బంగ్లాదేశీయులం అంటూ తప్పుడు ప్రచారంచేస్తున్నారు. సహాయం కోసం ఎంతోమంది వద్దకు వెళ్లాం. బతికుండగా మాకు ఎలాంటి న్యాయం దక్కలేదు. చనిపోయిన తర్వాత అయినా మాకు న్యాయం దక్కేలా చూడండి. వారికి కఠిన శిక్ష విధించండి. మా ఇల్లును ఆక్రమించుకున్న వారికి ప్రభుత్వంలోని పెద్దలతో సంబంధాలున్నాయి" అంటూ ఈ వీడియోలో వాపోయాడు.
తమ మరణం తర్వాత ఇంటి స్థలాన్ని ప్రార్థనామందిరానికి కేటాయించాలని, ఇంట్లోని వస్తువులను అనాథాశ్రమానికి ఇవ్వాలని, అలా అయితేనే తమ ఆత్మలకు శాంతి కలుగుతుందని వ్యాఖ్యానించాడు. ఈ హత్యల తర్వాత అర్షద్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. కాగా ప్రజలంతా న్యూఇయర్ సంబరాల్లో ఉండగా, లఖ్‌నవూలోని నాకా ప్రాంతంలో ఒక హోటల్‌లో ఈ రోజు ఉదయం హత్యలు వెలుగుచూశాయి. అతడి చెల్లెళ్ల వయసు 19 నుంచి 9 ఏళ్ల మధ్యలోఉంది. ఘటనా స్థలంలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో అర్షద్ తల్లి ఆష్మా సహా, తన నలుగురు చెల్లెళ్లు - రహ్మీన్ (18), అల్సియా (19), అక్ష (16), ఆలియా (9) ఉన్నారు.