Rajasthan Girl Borewell : రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక కథ విషాదాంతమైంది. చిన్నారిని కాపాడేందుకు అధికారులు సుదీర్ఘ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారీ ఆపరేషన్ చేపట్టిన అధికారులు 10రోజుల తర్వాత చిన్నారిని బయటకు బుధవారం రాత్రి వెలికితీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే, బోరుబావి నుంచి బయటకు తీసిన సమయంలో బాలికలో ఎటువంటి కదలికలు కనిపించలేదని ఎన్‌డీఆర్‌ఎఫ్ టీం ఇంఛార్జ్ యోగేశ్ మీనా వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
కోఠ్‌పుత్లీ జిల్లాలోని కిరాట్‌పుర గ్రామానికి చెందిన మూడేళ్ల చేతన డిసెంబరు 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులను ఆశ్రయించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి భారీ ఆపరేషన్ చేపట్టారు.
తొలుత హుకప్‌టెక్నిక్‌తో చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సఫలం కాకపోవడం వల్ల బోరుబావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వారు. ర్యాట్‌హోల్ మైనర్స్‌ను రంగంలో దించారు. పాలింగ్ మిషన్‌తో బోర్‌వెల్‌కు సమాంతరంగా 170 అడుగుల సొరంగాన్ని తవ్వారు. ఆమెను చేరుకునే మార్గంలో పెద్ద బండరాయి అడ్డుగా ఉండటం వల్ల ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడింది. ఇదే సమయంలో పైప్‌ల ద్వారా లోపలికి ఆక్సిజన్ పంపించడమే కాకుండా కెమెరాల్లో బాలిక కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. చివరకు 10రోజుల తర్వాత చిన్నారిని బయటకు తీసుకువచ్చారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందింది.