Cabinet Decisions Today : ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)తో పాటు పునర్‌వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (RWBCIS) పథకాలను కేంద్రం మరో ఏడాదికి పొడిగించింది. దీతో రైతుల పంటలకు మరింత రక్షణ లభించడమే కాకుండా నష్టాల పట్ల ఆందోళన తగ్గనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) బుధవారం సమావేశమై, ఈ నిర్ణయాలు తీసుకుంది. 2025లో తొలి కేబినెట్ భేటీని మోదీ రైతులకు అంకితం చేశారన్న కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, రైతుల సంక్షేమం గురించి భేటీలో చర్చ జరిగిందని తెలిపారు.
రెండు పంటల బీమా పథకాలను (PMFBY, RWBCIS) కేంద్రం 2025-26 వరకు పొడిగించినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వీటిని 15వ ఆర్థిక సంఘం కాలానికనుగుణంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. PMFBY, RWBCI పథకాలకు 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు రూ.66,550 కోట్లు కేటాయించగా, దాన్ని 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ.69,515.71 కోట్లకు పెంచారు.
రెండు పంటల బీమా పథకాల అమలులో సాంకేతికతను వినియోగించేందుకు రూ.824.77 కోట్ల కార్పస్‌తో ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ టెక్నాలజీ వినియోగంతో పంట నష్టం అంచనాలను త్వరగా తెలుసుకోవడమే కాకుండా క్లెయిమ్ సెటిల్‌మెంట్, వివాదాలను తగ్గించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రూ.1,350 చొప్పున రైతులకు అందజేసేందుకు రూ.3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ప్యాకేజీ పెంపుతో రైతులకు డీఏపీ ఎరువుల 50 కేజీల బస్తా 1,350 రూపాయలకే అందనుంది.
కేబినెట్ నిర్ణయాలపై ప్రధాని మోదీ ట్వీట్!
కేబినెట్ నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. "రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం మాది. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణం. 2025 మొదటి క్యాబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశాం. వారి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉంది" అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.