Leaning Tower of Pisa Sample in Sircilla : ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన నిర్మాణాల్లో ఇటలీలోని పీసా టవర్ ఒకటి. దాదాపు నాలుగు డిగ్రీల వంపుతో, 8 అంతస్తుల భవనంతో పడిపోతుందా అనేలా ఉంటుంది ఆ అద్భుత నిర్మాణం. అంతా పాలరాతితోనే నిర్మించిన ఈ సుందర భవనాన్ని 1200వ సంవత్సరంలో కట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అది చెక్కు చెదరలేదు. కాలానుగుణంగా అవసరమైన మరమ్మతులు చేస్తూ దాని రూపాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే 'పీసా టవర్' గురించి ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామని అనుకుంటున్నారా? ఎందుకంటే అలాంటి పీసా టవరే ఇప్పుడు తెలంగాణలోనూ దర్శనమిస్తుంది. అది కూడా పచ్చని పొలాల మధ్యన.
ఏంటీ? తెలంగాణలో ఇటలీలో ఉండే పీసా టవర్ ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీకు నమ్మకశక్యం కాని రీతిలో ఉన్న నిర్మాణం, దాని బ్యాక్ స్టోరీ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ తెలంగాణలో ఏ జిల్లా? ఏ మండలం? ఏ గ్రామంలో ఉంది అని ఆత్రుతగా వేచి చూస్తున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళదాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట శివారులోని పొలాల మధ్యలో ఈ ఇటలీ పీసా టవర్ ఉంది. అచ్చం చూడ్డానికి అలానే ఉన్నా, ఆ వంపు తిరిగిన నిర్మాణం అయితే కాదు.
కానీ ఈ భవంతి చూపరులను తెగ ఆకట్టుకుంటుంది. అక్కడికి వెళ్లిన వారు సెల్ఫీలు దిగుతూ ఇటలీ పీసా టవర్ అంటూ తెగ మురిసిపోతున్నారు. పచ్చని పొలాల మధ్యలో ఇంత అందమైన భవనం ఉండటం ఏంటని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, ఆ మధ్యలో పీసా టవర్ మాదిరి జీ+5 నిర్మాణం చేపట్టారు.
బ్యాక్ స్టోరీఇదే : ఈ భవన యజమాని చదువుకున్నప్పుడు ఇటలీలో 8 అంతస్తుల్లో ఉన్న పీసా టవర్‌ను చూసి ఆశ్చర్యపోయారంట. 2009లో దిల్లీ శివారులోని నోయిడాలోనూ పీసా టవర్ నమూనానే పోలిన నిర్మాణం చూశారంట. అప్పుడు తనకూ అలాంటి ఇల్లు కట్టుకోవాలని అనిపించిందట. దాంతో 2019లో తన కలను నిజం చేసుకుంటూ జీ+5తో నిర్మించుకున్నారు. అలాగే సొంతూరులో ఇళ్లు ఉండటం వల్ల, ఇక్కడికి అప్పుడప్పుడూ వచ్చి ఉంటున్నామని తెలిపారు. అయితే తన పూర్తి వివరాలు వెల్లడించడానికి ఆ వ్యక్తి ఇష్టపడలేదు. అయితేనేం చూడచక్కనైన ఇటలీ పీసా టవర్ నమూనా భవనాన్ని నిర్మించి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు.
ఈఫిల్ టవర్ మూసివేత- పర్యటకులకు సారీ చెబుతూ బోర్డు, అదే కారణమట!
TS Secretariat: నూతన సచివాలయం 'ప్రత్యేక వీడియో'.. ఎంత బాగుందో..