Sabarimala Special Passes Halted : శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్. అయ్యప్ప దర్శనం కోసం అటవీ మార్గంలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం జారీ చేసే ప్రత్యేక పాస్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) తెలిపింది. వర్చువల్ క్యూ సిస్టమ్, స్పాట్ బుకింగ్ ద్వారా పంబా మీదుగా వచ్చే భక్తులు ఎక్కువ సేపు దర్శనం కోసం వేచి ఉండకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు సభ్యుడు ఏ అజికుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అటవీ మార్గంలో భారీగా పెరిగిన భక్తులు
అటవీ మార్గంలో నడిచివెళ్లే 5 వేల మంది భక్తులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేసేందుకు అధికారులు ఇటీవలే ఏర్పాట్లు చేశారు. అయితే అటవీ మార్గం గుండా వచ్చే భక్తుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక పాస్‌ల జారీపై ఆంక్షలు విధించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రత్యేక పాస్‌లు జారీ చేయకూడదని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) ఓ ప్రకటనలో పేర్కొంది.
ఫారెస్ట్ రూట్లో శబరిమల వెళ్తే స్పెషల్ దర్శనం
అటవీ మార్గాల ద్వారా నడిచి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లను గత నెలలో చేశారు అధికారులు. నడిచి వెళ్లే భక్తులకు దర్శనం కోసం ప్రత్యేక క్యూ సహా అటవీ శాఖ జారీ చేసిన ప్రత్యేక ట్యాగ్‌లను అందించారు. తాజాగా ఈ ప్రత్యేక పాస్‌లను నిలిపివేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు ప్రకటించింది.
డిసెంబరు 30న తెరుచుకోనున్న ఆలయం
మండల పూజ సీజన్ ముగిసిన తర్వాత డిసెంబరు 26న శబరిమల ఆలయాన్ని మూసివేశారు. మళ్లీ డిసెంబర్ 30న మకరవిళక్కు ఉత్సవాల కోసం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరిచారు. జనవరి 14వ తేదీన శబరిమలలో మకరవిళక్కు నిర్వహిస్తారు. జనవరి 14వ తేదీన శబరిమల కొండపై అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ ప్రత్యేక ఘట్టానికి దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు ఏటా పెద్ద సంఖ్యలో హాజరు అవుతారు.