బంగాల్ మంత్రి పార్థాపై వేటు- ఆ డబ్బంతా ఆయనదే! - బంగాల్ న్యూస్
Partha chatterjee removal: ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టైన బంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని బర్తరఫ్ చేశారు. ఈ మేరకు బంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఆయన నిర్వహిస్తున్న శాఖలను ఇకపై తాను చేపడతానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

Partha chatterjee removal: బంగాల్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టైన మంత్రి పార్థా ఛటర్జీ మంత్రి పదవి కోల్పోయారు. ఈ మేరకు బంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న వాణిజ్య, ఐటీ శాఖల బాధ్యతలను ఇకపై తాను చేపడతానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఇలాంటి వ్యవహారాల్లో తమ పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీని వెనుక చాలా కుట్రలు ఉన్నాయని.. వాటి వివరాల్లోకి ప్రస్తుతం వెళ్లబోనని తెలిపారు మమత.
పార్టీ నుంచి కూడా సస్పెండ్..: మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన పార్థా ఛటర్జీని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది తృణముల్ కాంగ్రెస్. దర్యాప్తు ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తెలిపారు. పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నామని.. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుందన్నారు. రెండు దశాబ్దాలుగా టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఛటర్జీ.. గతేడాది పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

అంతకుముందు మంత్రి పార్థా ఛటర్జీని బర్తరఫ్ చేయాలంటూ భాజపా కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు సుకంత మజుందార్ సహా పులువురు నాయకులు పాల్గొన్నారు. టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని సుకంత మజుందార్ ఆరోపించారు.

ఈ కేసులో మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితను ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. బుధవారం మరోసారి అర్పితా ఇంట్లో నగదు పట్టుబడడం వల్ల అధికారులు గురువారం విచారించారు. తన ఇంట్లో లభించిన ఆ డబ్బంతా మంత్రి ఛటర్జీదేనని అర్పితా ముఖర్జీ ఒప్పుకొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. "నా ఇంట్లోని ఒక గదిలో పార్థా ఛటర్జీ డబ్బు దాచేవారు. ఆ గదికి మంత్రి, ఆయన మనుషులకు మాత్రమే ప్రవేశం ఉండేది. ప్రతి పది రోజులకు ఒకసారి ఛటర్జీ మా ఇంటికి వచ్చేవారు. నా ఇంటిని, మరో మహిళ ఇంటిని మినీ బ్యాంకులా ఉపయోగించుకునేవారు. ఆ మహిళ కూడా ఆయనకు సన్నిహితురాలే. ఆ గదిలో ఎంత డబ్బు ఉంచారో మంత్రి ఏనాడు చెప్పలేదు. ఆ డబ్బును నా సొంత పనులకు ఉపయోగించుకోలేదు." అని అర్పిత విచారణలో వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


సినీనటి అర్పితా ముఖర్జీ ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. గత శుక్రవారం ఈడీ జరిపిన సోదాల్లో ఆమె ఇంట్లో రూ.21కోట్లు బయటపడగా.. తాజాగా మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగించిన ఈడీ అధికారులు ఆమె అపార్ట్‌మెంట్‌లోని షెల్ఫ్‌లో నోట్ల కట్టలు గుర్తించినట్టు సమాచారం. ఇలా మొత్తం ఇప్పటివరకు రూ.28కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి: 17 ఏళ్లకే ఓటు హక్కు కోసం నమోదు.. ఈసీ కొత్త రూల్స్