చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ తుర్పు లద్దాఖ్‌లోని రెచిన్ లా సహా కీలక ఫార్వర్డ్ ప్రాంతాలను సందర్శించారు భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి సైనిక సన్నద్ధత, తాజా పరిస్థితులపై సమీక్షించారు. తూర్పు లద్దాఖ్‌లోని పరిస్థితులపై నరవాణేకు వివరించారు లేహ్‌లోని 14 కార్ఫ్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మెనన్.


నరవాణే పర్యటనపై ట్వీట్ చేసింది భారత సైన్యం.
" రిచెన్ లా సహా ఫైర్ అండ్ ఫర్రీ కార్ఫ్స్ ప్రాంతాలను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే సందర్శించారు. ఎల్ఏసీ వెంబడి పరిస్థితులను నేరుగా సమీక్షించారు. సైనిక సన్నద్ధతపై పూర్తి వివరాలు వివరించాం. ఈ సందర్భంగా ఫార్వర్డ్ ప్రాంతాల్లో మోహరించిన జవాన్లతో మాట్లాడారు నరవాణే. ఇదే ఉత్సాహం, శౌర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న జవాన్లను అభినందించారు. "
- భారత సైన్యం
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు నరవాణే. వారికి స్వీట్లు పంచిపెట్టారు.


తూర్పు లద్దాఖ్‌లోని కీలక ప్రాంతాల్లో శీతాకాలంలోనూ యుద్ధ సన్నద్ధతను ముమ్మరం చేసింది భారత్. ఇందుకోసం 50 వేల వరకు బలగాలను మోహరించింది. అలాగే.. ఎల్ఏసీకి అవతలివైపు చైనా కూడా అదే స్థాయిలో సైన్యాన్ని మోహరించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: చైనాకు చెక్ పెట్టేందుకు లద్దాఖ్‌లో 36 కొత్త హెలిప్యాడ్లు