రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలిపై రాళ్లతో దాడి చేసి చంపేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆమె తలలోని మాంసాన్ని తింటూ కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. మృతురాలిని శాంతి దేవిగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని శారధన గ్రామానికి చెందిన శాంతి దేవి(60) అనే మహిళను 24 ఏళ్ల వ్యక్తి చంపేశాడు. అనంతరం ఆమె తలలోని మాంసాన్ని తిన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న గొర్రెల కాపరులు అది చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అతడు పరారయ్యాడు.
అతికష్టమ్మీద పోలీసులు.. అతడిని అరెస్ట్ చేయగలిగారు. కాళ్లు, చేతులు కట్టేసి బంగర్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో పోలీసులకు చుక్కలు చూపించాడు నిందితుడు. ప్రస్తుతం అతడు మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఆస్పత్రి చుట్టూ పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అయితే పాకెట్లో ఉన్న ఆధార్ కార్డు ప్రకారం.. అతడిని ముంబయికి చెందిన సురేంద్రగా గుర్తించారు.
చికిత్స సమయంలో అతడు తన పేరు సలీం అని, మరోసారి సురేంద్ర అని డాక్టర్లకు తెలిపాడు. అతడి దగ్గర ముంబయి నుంచి సెంద్రకు వెళ్లేందుకు కొనుగోలు చేసిన బస్సు టిక్కెట్ కూడా ఉంది. దీంతో అతడు బస్సులోనే ముంబయి నుంచి సెంద్రకు చేరుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు రేబిస్‌తో బాధపడుతున్నాడని.. ఆ వ్యాధికి సంబంధించిన మెడికల్ స్లిప్ కూడా అతడి పాకెట్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై పూర్తి దర్యాప్తు ప్రారంభించామని వివరించారు.
హోటల్ వ్యాపారి దారుణ హత్య..
కేరళ కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్ అనే 58 ఏళ్ల ఓ హోటల్ వ్యాపారిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు స్నేహితులు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్‌లో తీసుకెళ్లి పాలక్కడ్ జిల్లా అట్టప్పాడి పాస్ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న 22 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి ఇద్దరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. ముక్కలుగా పడి ఉన్న మృతదేహం శరీర భాగాలను అట్టపాడి పాస్ వద్ద స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పంపించారు పోలీసులు. హత్య జరిగిన సమయంలో హోటల్ గదిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్న పాలక్కడ్‌కు చెందిన మరో వ్యక్తి ఆషిక్‌ను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.