Multivitamin Rich Foods: మనం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే శరీరానికి అనేక రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం ఉంటుంది. ఇవి సరిపడా లేని సందర్భాల్లోనే విటమిన్లు, మినరల్స్ లోపం కారణంగా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం సహజంగా కాకుండా టాబ్లెట్ల రూపంలో తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఆహరం రూపంలో పొందితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్టి విటమిన్లు లభించే ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం: ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి పోషకాలెన్నో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ గుప్పెడు బాదం తింటే మల్టి విటమిన్ మాత్రల్లో ఉండే రకరకాల పోషకాల మోతాదులు లభిస్తాయని అంటున్నారు. 2019లో Journal of Food Scienceలో ప్రచురితమైన "Nutrient profile of almonds" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఆకుకూరలు: పాలకూర వంటి ఆకుకూరల్లో ఎ, సి, ఇ, కె విటమిన్లు దండిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫోలేట్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం కూడా విరివిగా లభిస్తాయని అంటున్నారు. అందుకే ఆహారంలో ఆకుకూరలు విధిగా ఉండేలా చూసుకుంటే తగినన్ని విటమిన్లు అందుతాయని అభిప్రాయపడుతున్నారు.
పప్పులు: చిక్కుళ్లు, కంది, శనగ, పెసర, రాజ్మా వంటి పప్పుల్లో బి1, బి6, ఫోలేట్ బాగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంకా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలూ ఎక్కువేనని వివరిస్తున్నారు. వీటిల్లో ప్రొటీన్, పీచు సైతం దండిగా ఉంటాయని.. ఇవి జీర్ణక్రియకు తోడ్పడి శక్తిని కలగజేస్తాయని చెబుతున్నారు. రోజూ పప్పులను తింటే గుండె ఆరోగ్యమూ మెరుగవుతుందని తెలిపారు. రక్తంలో గ్లూకోజు మోతాదులు కూడా స్థిరంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు.
గుడ్లు: ఇందులో విటమిన్ డి, బి12 వంటి విటమిన్లతో పాటు ఖొలీన్, సెలీనియం, బయోటిన్ ఖనిజాలూ ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ విటమిన్లకు బదులు ఆహారంలో గుడ్లను చేర్చుకుంటే శరీరానికి సహజ పోషకాలు అందుతాయని సూచిస్తున్నారు.
సజ్జలు, సామలు: పేరుకు చిరుధాన్యాలే అయినా పోషకాలు ఎక్కువగానే ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఐరన్త పాటు జీవక్రియలకు తోడ్పడే మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి ఖనిజాలూ ఎక్కువగానే ఉంటాయని వివరిస్తున్నారు. రోజూ చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే రకరకాల పోషకాలు లభించేలా చూసుకున్నట్టేనని చెబుతున్నారు.
జామ, రేగు: సీజనల్ ఫలాల్లో జామ, రేగు పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందులో కండరాల పనితీరును నియంత్రించే, ఎలక్ట్రోలైట్లను సమతూకంలో ఉంచే పొటాషియం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా శరీరానికి ఫోలేట్, ప్రొటీన్ కూడా అందుతాయని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'వాకింగ్ ఇలా చేస్తేనే బీపీ, షుగర్, బరువు తగ్గుతుంది'- మరి ఎలా చేయాలో మీకు తెలుసా?