రూ.లక్షన్నర చెప్పులు, 80వేల జీన్స్.. జైలులో సుఖేశ్ రాజభోగాలు - రైడ్ సమయంలో గదిలో మూలన నిల్చొని ఏడుస్తున్న సుఖేశ్
🎬 Watch Now: Feature Video
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సుఖేశ్ ఉంటున్న జైలు గదిలో ఖరీదైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్షన్నర రూపాయలు విలువైన చెప్పులు, 80 వేల రూపాయలు విలువైన జీన్స్ ప్యాంటులు ఈ జాబితాలో ఉన్నాయి. సుఖేశ్ సెల్లో సోదాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ నిందితుడు. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన సుఖేశ్‌ను వారంక్రితం మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేసి, దిల్లీ మండోలీ జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి జైలు అధికారులు సుఖేశ్ సెల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైల్లోనూ అతను రాజభోగాలు అనుభవిస్తున్నట్లు గుర్తించారు.
తనిఖీల్లో భాగంగా సుఖేశ్ గదిలో అత్యంత విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్షన్నర రూపాయలు విలువైన గూచీ చెప్పులను గుర్తించారు. దీంతోపాటు 80వేల రూపాయలు విలువైన 2 జీన్స్ ప్యాంట్లు లభ్యమయ్యాయి. తనిఖీల సమయంలో జైలు గదిలోని ఓ మూలన నిలబడిన సుఖేశ్.. జైలర్ దీపక్ శర్మ ముందు ఏడ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి మరో జైలు అధికారి.. సుఖేశ్ గదిలోని అణువణువూ గాలించారు. రేలిగేర్ ప్రమోటర్ మల్విందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పించేందుకు మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నాడని.. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో గత వారం సుఖేశ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేసింది.