'డాక్టర్ బాబు' కోసం 500 మంది ఆందోళన.. దిగొచ్చిన పోలీసులు.. చివరకు.. - కేరళ డాక్టర్ బాబు వీడియో
🎬 Watch Now: Feature Video
ఓ వైద్యుడి కోసం ఏకంగా ఒక గ్రామమే కదిలి వచ్చింది. తమ 'అభిమాన వైద్యుడి'ని విడుదల చేయాలంటూ 500 మందికి పైగా గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో జరిగింది. 40 ఏళ్లుగా తమకు, తమ పిల్లలకు తక్కువ ఫీజుతో వైద్యం అందిస్తున్న 'డాక్టర్ బాబు'ను పోలీస్ స్టేషన్ నుంచి విడిచి పెట్టాలని వీరంతా రోడెక్కారు.
62 ఏళ్ల బాబు.. కేరళకు చెందిన ఓ హోమియోపతి వైద్యుడు. 40 ఏళ్ల క్రితం జీవనం కోసం తేని జిల్లాలోని ఆండిపట్టి సమీపంలో ఉన్న రెంకరాంపట్టి అనే గ్రామానికి వలస వచ్చారు. ఓ చిన్న హోమియోపతి క్లినిక్‌ను తెరిచి అక్కడున్న పేద ప్రజలకు తక్కువ డబ్బుతో వైద్యం అందిస్తున్నారు. ఈ గ్రామంలో సుమారు 300 వరకు కుటుంబాలు జీవిస్తున్నాయి. కొన్నేళ్లుగా వీరికి ఏ చిన్న జబ్బు చేసినా కొంత మొత్తంలో ఫీజు తీసుకుని మందులు ఇచ్చేవారు బాబు. ఒక్కోసారి ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే ఉచితంగానే ట్రీట్మెంట్ ఇచ్చేవారు. కరోనా విజృంభణ సమయంలో కూడా ఆ ప్రాంత ప్రజలకు అనేక రకాల సహాయ సహకారాలు అందిచారు బాబు.
అయితే.. అనుమతి లేకున్నా కొందరు రోగులకు బాబు ఇంగ్లిష్ మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన రఘురాం అనే వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆండిపట్టి పోలీసులు డాక్టర్ బాబును అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం ఆ గ్రామ ప్రజలకు తెలిసింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న గ్రామస్థులు తమకు ఎంతో సేవ చేసిన ప్రియమైన వైద్యుడిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఇప్పటివరకు బాబు చేసిన వైద్యం వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదని గ్రామస్థులు వివరించారు. ఈ విషయంపై డీఎస్పీ రామలింగం స్థానికులకు ఎంత నచ్చజెప్పినా ఆందోళన విరమించలేదు. చివరకు పోలీసులే దిగి వచ్చారు. చేసేదేమీ లేక డాక్టర్ బాబును విడిచి పెట్టారు. ఇంకోసారి ఇంగ్లిష్ మందులు ఇవ్వకూడదని హెచ్చరించారు.
TAGGED:
doctor babu in tamilnadu