మాజీ మంత్రి పెంపుడు శునకానికి ఘనంగా అంత్యక్రియలు
🎬 Watch Now: Feature Video
19 ఏళ్లుగా పెంచుకుంటున్న శునకం పట్ల తన ప్రేమను చాటుకున్నారు బిహార్ జేడీయూ నేత, మాజీ మంత్రి బీమా భారతి. అనారోగ్యంతో మరణించిన తమ పెంపుడు కుక్క కృష్ణకు హిందూ సంప్రదాయాల ప్రకారం ఘనంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త అవధేశ్ మండల్, కుమారుడు సైతం పాల్గొన్నారు. శునకం పార్థివదేహాన్ని ఉంచిన పాడెను మోస్తూ కన్నీరు పెట్టుకున్నారు. వీరితో పాటు గ్రామంలోని మరికొంత మంది కూడా కృష్ణ అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ అంతిమ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీమా భారతి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి నివాళులర్పించారు.
ఎన్నో ఏళ్లుగా తమ వద్ద విశ్వాసంగా ఉన్న శునకం హఠాత్తుగా మరణించడం వల్ల బీమా భారతి కన్నీటి పర్యంతమయ్యారు. పెంపుడు కుక్క కృష్ణ అంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని.. దాదాపు 19 ఏళ్లుగా దాన్ని కుటుంబంలోని ఓ సభ్యునిగా చూసుకున్నామని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి. తాము ఎక్కడికెళ్లినా కృష్ణ తమతో పాటే వచ్చేదని ఆమె గుర్తుచేసుకున్నారు. తన భర్త అవధేశ్ మండల్ ఓ వివాదంలో ఇరుక్కున్నప్పుడు కుక్క కృష్ణపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె చెప్పారు. కృష్ణ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.