శ్మశానంలోకి దూసుకెళ్లిన బస్సు.. ధ్వంసమైన సమాధులు - శ్మశాన వాటికలోకి ప్రవేశించిన బస్సు
🎬 Watch Now: Feature Video
దేశ రాజధాని దిల్లీలో ఓ బస్సు తీవ్ర కలకలం సృష్టించింది. సెంట్రల్ దిల్లీలోని ఖాన్ మార్కెట్ ప్రాంతంలో ఓ డీటీసీ బస్సు అదుపుతప్పి ఓ శ్మశానవాటికలోకి దూసుకెళ్లింది. ఫలితంగా దాదాపు 10 నుంచి 12 సమాధులు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఓ బస్సు అదుపుతప్పి శ్మశానవాటిక గోడను ఢీకొట్టి.. లోపలికి దూసుకెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం రావడం వల్ల శ్మశానంలో ఉంటున్న సంరక్షుడి కుటుంబం గమనించింది. వారు వెంటనే శ్మశాన వాటికల కమిటీ కార్యదర్శి యూజీన్ రత్నంకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న యూజీన్ రత్నం సంబంధిత ప్రభుత్వాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. క్రేన్ల సహాయంతో బస్సును శ్మశానం నుంచి బయటకు తీశారు. బ్రేక్ ఫెయిలైనందునే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ స్టాప్‌లో దింపి డిపో వైపునకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో డ్రైవర్, కండక్టర్ మాత్రమే బస్సులో ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం కొన్ని కుటుంబాలు ప్రమాదంలో దెబ్బతిన్న తమ వారు సమాధులను చూడడానికి వచ్చాయని తెలిపారు.