పట్టపగలే దోపిడీ.. బైక్‌లపై వెంబడించి, తుపాకులతో బెదిరించి.. - వ్యాపారి నుంచి రూ 2 లక్షలు దోచుకెళ్లిన దొంగలు
🎬 Watch Now: Feature Video
Delhi Robbery : దిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ వద్ద పట్టపగలే దోపిడీ జరిగింది. కారులో వెళ్తున్న బంగారు ఆభరణాల వ్యాపారి, అతడి సహచరుడిని ఆపిన దొంగలు వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయలను నగదును దోచుకెళ్లారు. రెండు బైకులతో వెంబడించి.. రోడ్డుపై వెళ్తున్న కారును అడ్డగించి తుపాకులు చూపించి నగదు బ్యాగును ఎత్తుకెళ్లారు. ఈ నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడ్ని సంజన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడు గుజరాత్‌లోని మెహసానా ప్రాంతానికి చెందిన వ్యక్తి. దిల్లీలోని చాందినీ చౌక్ ఏరియాలో ఇతడికి నగల దుకాణం ఉంది. ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు, తన సహచరుడైన జితేంద్ర పటేల్‌తో కలిసి క్యాబ్‌లో గురుగ్రామ్‌లో వెళుతున్నాడు. మొదటి నుంచే కారును అనుసరిస్తున్న వస్తున్న దొంగలు.. దారిలో ఈ ఘటనకు పాల్పడ్డారు.
గవర్నర్ రాజీనామా చేయాలని కేజ్రీవాల్ డిమాండ్..
ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ అందించేవారికి మార్గం సుగమం చేయాలన్నారు. "దిల్లీని పూర్తి సురక్షిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం మార్చలేకపోతోంది. లా అండ్ ఆర్డర్‌ను మాకు అప్పగించండి. దిల్లీ ప్రజలకు మేము భద్రత కల్పిస్తాం" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.